India Vs England 5th Test : ఇప్పటికే ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌ను టీమ్‌ఇండియా 3-1తో సొంతం చేసుకుంది. దీంతో గురువారం ధర్మశాల వేదికగా జరగనున్న నామమాత్రపు చివరి టెస్టులో రోహిత్ సేన మరోసారి తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది.
సిరీస్ ఫలితాన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఈ మ్యాచ్‌కు అధిక ప్రాధాన్యత లేనట్లే. కానీ ఈ ఈ పోరు యంగ్ ప్లేయర్ రజత్ పటీదార్‌కు ఎంతో ముఖ్యమైంది. ఈ మ్యాచ్ ద్వారా టీమ్‌ఇండియాలో తన స్థానాన్ని నిర్ణయించే అవకాశాలున్నాయి.
ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్‌లో ఆడిన రజత్ 32, 9, 5, 0, 17, 0 పరుగులు మాత్రమే నమోదు చేయగలిగాడు. అరంగేట్ర సిరీస్‌లో పటీదార్ ఇప్పటివరకూ 10.5 సగటుతో 63 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతడి నుంచి ఏ మాత్రం ఆశించని పెర్ఫామెన్స్ ఇది. తన ట్యాలెంట్‌కు తగ్గ తగ్గ ఆటతీరు ఇది కానే కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అవకాశం అందుకోలేక :
తొలి రెండు టెస్టులకు కోహ్లి దూరమవగానే ఆ స్థానంలోకి వచ్చాడు పటీదార్. రంజీల్లో తన అద్భుతమైన ఫామ్‌ను చూసి సెలెక్టర్లు పుజారా, సర్ఫరాజ్‌ను పక్కనబెట్టి రజత్‌ను ఎంపిక చేశారు. అయితే శ్రేయస్, కేఎల్ రాహుల్ కారణంగా తొలి టెస్టులో అవకాశాలు రాలేదు. కానీ గాయం కారణంగా రాహుల్ మ్యాచ్‌లకు దూరమవడం వల్ల విశాఖలో జరిగిన రెండో టెస్టుతో రజత్ టెస్టు అరంగేట్రం చేశాడు. అయితే అతడు ఆశించిన స్థాయిలో పెర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు.
ఇక మూడో టెస్టుతో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ మాత్రం పరుగుల వరద పారించి ఆకట్టుకున్నారు. పటీదార్ మాత్రం ఇంకా పేలవ ఫామ్‌తోనే జట్టులో సాగుతున్నాడు. షార్ట్ పిచ్ బంతులు ఆడటంలో బలహీనత, స్పిన్నర్లను ఎదుర్కోవడంలోనూ విఫలమవ్వడం వల్ల అతడు మరింత డీలాపడ్డాడు.
మరోవైపు ఇంగ్లాండ్‌తో సిరీస్ జట్టులో ఇప్పటివరకూ షాట్లపై కంట్రోల్ సాధించి 100 బంతులాడిన వాళ్లలో శుభ్‌మన్ గిల్, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్ మాత్రమే పటీదార్ (89.02 శాతం) కంటే మెరుగ్గా ఉన్నారు. ఇక తప్పుడు షాట్ల విషయానికి వస్తే తక్కువగా ఆడింది కూడా అతనే అని చెప్పాలి. 18 షాట్లు మాత్రమే ఇలాంటివి ఉన్నాయి. కానీ ఆరు సార్లు మాత్రమే ఔటయ్యాడు. అతనికి అదృష్టమూ కలిసి రాలేదనే చెప్పాలి.
పడిక్కల్‌కు ఛాన్స్ ఉందా ?
ఇప్పటికే సిరీస్ గెలిచినందున ఈ నామమాత్రపు చివరి టెస్టులో రజత్ స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్ వచ్చేలా కనిపిస్తున్నాడు. పడిక్కల్ టెస్టు అరంగేట్రం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. 31 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో పడిక్కల్ 44.54 సగటుతో 2227 పరుగులు సాధించాడు. ఇక ఫస్ట్‌క్లాస్, లిస్ట్- ఎ క్రికెట్లో కలిపి గత 14 ఇన్నింగ్స్‌ల్లో ఆరు సెంచరీలు చేశాడు. ఒక ఇన్నింగ్స్‌లో అజేయంగా 93 పరుగులు కూడా చేశాడు.
ఒకవేళ రజత్‌ను పక్కనపెట్టే ఛాన్సెన్స్ ఉంటే విదర్భతో మధ్యప్రదేశ్ రంజీ సెమీస్ నేపథ్యంలో చివరి టెస్టుకు ముందు బీసీసీఐ అతణ్ని జట్టు నుంచి విడుదల చేసేదనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. అలా చేయలేదంటే ఇంకా టీమ్‌ఇండియా అతనిపై నమ్మకముంచి, అతడికి మరో అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
అరంగేట్రంలోనే అదరగొట్టేస్తున్న కుర్రాళ్లు - ప్రత్యర్థి జట్టు ఢమాల్!