India Vs Bangladesh 2nd Test Day 3 : భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టులో మూడో రోజు కూడా రద్దైంది. రెండో రోజు మాదిరిగానే ఆదివారం కూడా ఒక్క బంతి పడకుండానే ఆట రద్దైంది. అయితే ఆదివారం పెద్దగా వర్షం అంతరాయం లేకపోయినా, మైదానం చిత్తడిగా మారడం వల్ల ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇక తొలి రోజు కేవలం 35 ఓవర్ల ఆట కొనసాగింది. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ 107-3 స్కోర్‌తో ఉంది. క్రీజులో మొమినుల్ హక్ (40 పరుగులు), ముష్ఫికర్ రహీమ్ (6 పరుగులు) ఉన్నారు.
అంపైర్లు పరిశీలించినా!
అంపైర్లు ఆదివారం ఉదయం 10 గంటలకు ఓ సారి మైదానం పరీక్షించగా, అక్కడక్కడ మైదానం సిద్ధంగా లేకపోవడం వల్ల ఆటను 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత 12 గంటలకు ఒకసారి, 2 గంటలకు మరోసారి పిచ్, మైదానాన్ని పరిశీలించి ఆట రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
UPDATE 🚨
— BCCI (@BCCI) September 29, 2024
Play for Day 3 in Kanpur has been called off due to wet outfield.#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/HPPxBMhY87
టెస్ట్ రద్దైతే భారత్‌కు ఇబ్బందా?
ప్రస్తుతం బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 107/3 స్కోరుతో కొనసాగుతోంది. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినట్లయితే ఈ సిరీస్‌ను టీమ్ఇండియా 1-0తో కైవసం చేసుకుంటుంది. కానీ, ఈ మ్యాచ్ రద్దైనా, డ్రాగా ముగిసినా భారత్‌కు 2025 వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు కాస్త సంక్లిష్టంగా మారనున్నాయి. మరి టీమ్ఇండియాకు డబ్ల్యూటీసీ ఫైనల్ ఛాన్స్‌లు ఎలా ఉన్నాయి? తర్వాత భారత్ ఎన్ని మ్యాచ్‌లు నెగ్గాలి? ఇప్పుడు చూద్దాం.
2023- 25 డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో ఏడింట్లో నెగ్గి, 2 టెస్టుల్లో ఓడింది. మరోకటి డ్రా చేసుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం భారత్ 71.67 శాతం (86 పాయింట్లు) తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఆస్ట్రేలియా 12మ్యాచ్‌ల్లో 8 విజయాలు నమోదు చేసి 62.50 శాతం (90 పాయింట్లు)తో రెండో స్థానంలో ఉంది.
ప్రస్తుత బంగ్లా సిరీస్ తర్వాత 2025 డబ్ల్యూటీసీలో భారత్ ఇంకా 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో 3 మ్యాచ్‌లు న్యూజిలాండ్‌తో, 5 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే బంగ్లా సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకున్నట్లైతే, మిగిలిన 8 టెస్టుల్లో భారత్ కనీసం 3 మ్యాచ్‌లు నెగ్గినా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
అదే భారత్ - బంగ్లా టెస్టు డ్రా గా ముగిస్తే, 1-0తో సిరీస్ నెగ్గుతుంది. కానీ, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే టీమ్ఇండియా తన తర్వాతి 8 టెస్టుల్లో 5 మ్యాచ్‌లు నెగ్గాల్సి ఉంటుంది. స్వదేశంలో కివీస్‌తో 3, ఆస్ట్రేలియాపై కనీసం 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించాలి. అలాగే ప్రస్తుతం మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న శ్రీలంక (50 పాయింట్ల శాతం), న్యూజిలాండ్ (42.86 శాతం) తమ తదుపరి మ్యాచ్‌ల ఫలితాలపై కూడా భారత్ ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.