India First Match Win: క్రికెట్లో టెస్టు ఫార్మాట్‌కు ఉండే క్రేజ్ వేరు. క్రికెట్లో తొలినాళ్లలో టెస్టు ఫార్మాట్లోనే మ్యాచ్‌లు జరిగేవి. అయితే భారత జట్టు కూడాఎన్నో సవాళ్లతో క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇక మంచి ప్రదర్శన చేస్తున్నా, తొలి గెలుపు కోసం టీమ్ఇండియా చాలా ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. అనేక మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా విజయం అంచులదాకా వచ్చి ఓటమిపాలైన సందర్భాలెన్నో ఉన్నాయి. అలా ఓ దశాబ్దంపాటు ప్రయత్నించగా చివరకు 72 ఏళ్ల కిందట టీమ్ఇండియా టెస్టుల్లో తొలి విజయం అందుకుంది.
దాదాపు 23మ్యాచ్‌ల తర్వాత టీమ్ఇండియా 1952 ఫిబ్రవరి 8న క్రికెట్లో గెలుపు రుచి చూసింది. చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో నెగ్గింది. దిగ్గజ ఆటగాడు విజయ్ హరారే కెప్టెన్సీలో టీమ్ఇండియా తొలిసారి టెస్టుల్లో విజయం సాధించింది. నాటి లెప్ట్ ఆర్మ్ స్పిన్నర్ వినూ మన్కడ్ 12 వికెట్లు (తొలి ఇన్నింగ్స్ 8, రెండో ఇన్నింగ్స్ 4) పడగొట్టి టీమ్ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. దీంతో టెస్టుల్లో సింగిల్ మ్యాచ్‌లో 10+ వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లోనే స్పిన్నర్ వినూ మన్కడ్ ఒక్కడే 8 వికెట్లు నేలకూల్చాడు. 38.5 ఓవర్లు బౌలింగ్ చేసిన మన్కడ్ ఏకంగా 15ఓవర్లను మెయిడెన్లుగా మలిచాడు. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఆడి 457-9 వద్ద డిక్లేర్డ్ చేసింది. టాపార్డర్‌లో పంకజ్ రాయ్ (111), లోయార్డర్‌లో పాలి ఉమ్రిగర్ (130) శతకాలతో రాణించడం వల్ల భారత్‌కు భారీ ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 183 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 8 పరుగులు ఇన్నింగ్స్ తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్‌లో వినూ మన్కడ్తోపాటు పంకజ్ రాయ్, దత్తు ఫాడ్కర్, పాలి ఉమ్రిగర్, గులామ్ అహ్మద్ టీమ్ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించారు.
క్లైవ్ లాయిడ్ టు కపిల్ దేవ్ - వరల్డ్‌కప్ ఫైనల్‌కు హీరోలందరూ వస్తున్నారుగా!
23 ఏళ్లైనా చెరగని దాదా రికార్డు.. ప్రపంచకప్ హిస్టరీలో ఆసియా బ్యాటర్ల టాప్-5 స్కోర్లు ఇవే..