India Archery Performance In Olympics: 2024 పారిస్ ఒలింపిక్స్ క్రీడలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ మెగాటోర్నీ కోసం అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున వివిధ క్రీడల్లో 117 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీ ఈవెంట్లలో భారత్ తరఫున ఆరుగురు అథ్లెట్లు ప్రాతినిధ్యం వహించనున్నారు. అయితే ఒలింపిక్స్ ఆర్చరీ ఈవెంట్‌లో భారత్‌కు ఇప్పటివరకూ ఒక్క పతకం కూడా రాలేదు. కానీ, పారిస్‌లో మాత్రం భారత్ బోణీ కొట్టేలా కనిపిస్తోంది. ఎందుకంటే మెరుగైన ప్లేయర్లు ఆర్చరీ విభాగంలో పాల్గొంటున్నారు. మరెందుకు ఆలస్యం ఆర్చరీ చరిత్ర, భారత్ ట్రాక్ రికార్డు గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆర్చరీ చరిత్ర
1900, 1904, 1908, 1920 ఒలింపిక్ ఎడిషన్లలో ఆర్చరీ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఆ తర్వాత దీనికి ఆదరణ తగ్గింది. మళ్లీ 1931లో ఒలింపిక్స్‌లో ఆర్చరీని చేర్చేందుకు వరల్డ్ ఆర్చరీని ఏర్పాటు చేశారు. 1972 ఎడిషన్‌లో ఒలింపిక్ గేమ్స్‌లో ఆర్చరీ వచ్చింది. అయితే ఆర్చరీలో భారత్ అథ్లెట్లు పలుమార్లు పోటీపడినప్పటికీ ఇప్పటివరకు ఒక్క పతకాన్ని కూడా గెలవలేదు.
ఆర్చరీలో ప్రముఖ ప్లేయర్లు
బెల్జియంకు చెందిన హుబెర్ట్ వాన్ ఇన్నిస్ 1900- 1920 మధ్య జరిగిన ఒలింపిక్స్‌లో ఆరు స్వర్ణాలు, మూడు రజత పతకాలను గెలుచుకున్నాడు. అలాగే కొరియాకు చెందిన కిమ్ సూ న్యుంగ్ నాలుగు బంగారు పతకాలు, ఒక రజత పతకాన్ని ఎగరేసుకుపోయాడు. అమెరికా చెందికు డారెల్ పేస్ మాంట్రియల్ రెండు స్వర్ణాలు గెలిచాడు. కాగా, ఇప్పటివరకు 23 స్వర్ణాలు సహా మొత్తం 39 పతకాలను సాధించిన కొరియా ఆర్చరీలో నెంబర్ వన్‌గా ఉంది.
ఈసారి భారత్ ఆర్చరీ ప్లేయర్లు
ధీరజ్ బొమ్మదేవర: 22ఏళ్ల ధీరజ్ బొమ్మదేవర గత కొంతకాలంగా అంతర్జాతీయ వేదికలపై నిలకడైన ప్రదర్శనతో రాణిస్తూ అంచనాలు పెంచేశాడు. ప్రపంచ ర్యాకింగ్స్‌లోనూ 12వ స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో 81 శాతం విజయాలను నమోదు చేశాడు. పురుషుల జట్టుతో కలిసి నిరుడు ఆసియా క్రీడల్లో రజతం, ఈ ఏడాది షాంఘై ప్రపంచకప్‌లో స్వర్ణం ఖాతాలో వేసుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లోనే మిక్స్‌డ్ విభాగంలోనూ కాంస్యాన్ని ముద్దాడాడు. అతడు ఇదే నిలకడ కొనసాగిస్తే ఒలింపిక్ విలువిద్యలో భారత్‌కు పతకం దక్కడం ఖాయం! ధీరజ్‌కు విలువిద్యలో కొరియన్, చైనీస్ ఆర్చర్ల నుంచి కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి.
తరుణ్ దీప్ రాయ్: ఈ యువ ఆటగాడు కూడా కొంతకాలంగా విలువిద్యలో అదరగొడుతున్నాడు. 64శాతం విజయాలతో ప్రపంచ ర్యాకింగ్స్లో 31వ స్థానంలో నిలిచాడు. ఆసియా ప్రపంచకప్‌లో రజతం సాధించాడు.
ప్రవీణ్ జాదవ్: 2021 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రవీణ్ వ్యక్తిగత ఈవెంట్‌లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. కానీ, రెండో రౌండ్లో నిష్క్రమించాడు. ప్రవీణ్ జాదవ్ 43శాతం విజయాలతో ఉన్నాడు.
దీపికా కుమారి: భారత్ దీపికా కుమారిపై భారీగా ఆశలు పెట్టుకుంది. ఆమె కెరీర్లో ఇప్పటివరకు అనేక ఈవెంట్లలో పాల్గొని పలు ట్రోఫీలను గెలుచుకుంది. అయితే ఒలింపిక్స్‌లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. ప్రస్తుతం 12వ ర్యాంక్‌లో ఉంది. దీపిక ఈ సీజన్ లో 75శాతం విజయాలను సాధించింది.
భజన్ కౌర్: 18ఏళ్ల భజన్ కౌర్ ఆర్చరీలో పతకాన్ని ముద్దాడేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం 45వ ర్యాంకులో ఉంది. ఆమె ఈ ఏడాది ఐదు టోర్నమెంట్‌ల్లో పాల్గొంది. ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో ఒక స్వర్ణం గెలుచుకుంది. 64శాతం విజయాలను నమోదు చేసింది.
అంకిత భకత్: అంకిత భకత్ ఈ సీజన్‌లో 60 విజయాలను నమోదు చేసింది. ఈమెకు పారిస్ ఒలింపిక్స్ మొదటివి.
ఆర్చరీలో భారత్ ట్రాక్ రికార్డ్
భారత జట్టు తొలిసారి 1988 ఒలింపిక్స్‌కు తమ ఆర్చర్లను పంపింది. అప్పుడు దేశానికి నిరాశే ఎదురైంది. ఇప్పటివరకు ఒలింపిక్స్ ఆర్చరీ విభాగంలో భారత్‌కు పతకం దక్కలేదు. అయితే ఆసారి అత్యత్తమ ఆర్చర్లు పోటీల్లో పాల్గొనడం కలిసొచ్చే అంశం. దీంతో భారత్ ఖాతాలో ఈసారి ఆర్చరీ విభాగంలో పతకం చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
ఒలింపిక్స్ ఆర్చరీ ఈవెంట్స్
- పురుషుల వ్యక్తిగత విభాగం
- మహిళల వ్యక్తిగత విభాగం
- పురుషుల జట్టు
- మహిళల జట్టు
- మిక్స్ డ్ టీమ్ ఈవెంట్
Aditi swami archery : అదితి అదరహో.. 17 ఏళ్లకే సీనియర్ ప్రపంచ ఛాంపియన్‌గా..