Ind Vs USA T20 World Cup 2024 : ఆతిథ్య హోదాలో తొలిసారి టీ-20 ప్రపంచకప్‌లో ఆడుతున్న పసికూన అమెరికా జట్టుపై అందరి దృష్టి నెలకొంది. మహా అయితే ఆ జట్టు లీగ్ దశలో ఒక మ్యాచ్ గెలుస్తుందని భావిస్తే అందరి అంచనాలకు మించి రాణిస్తోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సూపర్-8లో రేసులో ముందంజలో ఉంది.
అలా మాజీ ఛాంపియన్ పాకిస్థాన్‌పై సంచలన విజయం సాధించిన అమెరికా ఇప్పుడు టీమ్‌ఇండియాతో మ్యాచ్‌కు సై అంటోంది. న్యూయార్క్ వేదికగా భారత్‌తో తలపడనుంది. పాకిస్థాన్‌ను సూపర్ ఓవర్‌లో ఓడించి మంచి ఊపు మీదున్న యూఎస్ భారత్‌తో జరిగే మ్యాచ్‌లోనూ గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. అమెరికా జట్టులో భారతి సంతతి ఆటగాళ్లు ఉండటం వల్ల ఈ మ్యాచ్ కాస్త ఇండియా వర్సెస్ మినీ ఇండియాగా మారిపోయింది.ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు హ్యాట్రిక్ సాధించడం సహా సూపర్-8 బెర్తును ఖాయం చేసుకుంటుంది.
పేరుకు అమెరికా జట్టే అయినా అందులో చాలామంది భారత సంతతి ఆటగాళ్లే ఉన్నారు. వారే ఇప్పుడు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. భారత సంతతి ఆటగాళ్లయిన కెప్టెన్ మోనాంక్ పటేల్, బౌలర్లు సౌరభ్ నేత్రావాల్కర్, హర్మిత్‌సింగ్, జస్‌దీప్ సింగ్, నితీశ్‌కుమార్‌తో భారత్ జట్టు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా భారత్‌కు షాక్ తప్పదని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పాకిస్థాన్‌పై మోనాంక్ పటేల్ అర్ధ శతకం చేశాడు. ఆ జట్టులోని ఆరోన్ జోన్స్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
కెనడాపై 94 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో బ్యాటర్ ఆంద్రీస్ గౌస్ ఇదే మ్యాచ్‌లో అర్ధశతకం బాదాడు. పాక్‌తో మ్యాచ్‌లోనూ వీరిద్దరూ రాణించారు. వీరికి అడ్డుకట్ట వేయడానికి భారత్ ప్రణాళికలు రచించాల్సి ఉంది. డ్రాప్ ఇన్ పిచ్‌లపై ఆడిన అనుభవం అమెరికా బ్యాటర్లకు ఉండడం వల్ల వారు చాలా తేలికగా పరుగులు చేస్తున్నారు. ఆ పిచ్‌లపై ఇతర జట్ల ఆటగాళ్లు మాత్రం పరుగులు రాబట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అమెరికా స్పిన్నర్ నోస్తుష్ కెంజిగేతో భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు మూడు వికెట్లు పడగొట్టాడు.
మరోవైపు ఐర్లాండ్‌పై సునాయసంగా నెగ్గిన రోహిత్ సేన పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో విజయాన్ని అందుకుంది. బ్యాటర్లు నిరాశపర్చినా, బౌలర్లు అదరగొట్టడం వల్ల 120 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది.ఈ విజయంతో భారత జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది.
న్యూయార్క్‌లో రెండు మ్యాచ్‌లు ఆడటం వల్ల అక్కడి పరిస్థితులపై భారత జట్టుకు అవగాహన ఏర్పడింది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యారు. భారత్ సూపర్-8 చేరడం దాదాపు ఖాయం కావడం వల్ల వీరు ఫామ్‌ను అందిపుచ్చుకోవాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య, బుమ్రా కీలకం కానున్నారు. అలసత్వం లేకుండా సమష్టిగా రాణిస్తే అమెరికాపై భారత్ సునాయాస విజయాన్ని అందుకునే అవకాశం ఉంది.
రిజ్వాన్, బాబర్ అదుర్స్ - కీలక మ్యాచ్లో గట్టెక్కిన పాక్ - T20 World Cup 2024