IND VS SA Surya Kumar Yadav : సౌతాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తలపడేందుకు టీమ్ ఇండియా సన్నద్ధమైంది. ఈ క్రమంలోనే క్రికెట్ అభిమానుల్లో మరింత ఆసక్తి రేకెత్తించేందుకు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ చెఫ్ అవతారం ఎత్తాడు. ఓ వంటకం గురించి ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. అయితే అది తినేది కాదండోయ్. మైదానంలోకి దిగే ప్లేయర్ల గురించి.
సౌతాఫ్రికాతో సిద్ధమయ్యే భారత జట్టు గురించి సూర్య మాట్లాడాడు. ఆ వీడియోను బీసీసీఐ తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసింది. ఇందులో తాను తయారు చేయబోయే రెసిపీ గురించి ఆసక్తికరంగా సూర్య చెప్పాడు.
"హాయ్ ఫ్రెండ్స్, మీకోసం నేను రెండు సూపర్ రెసిపీలను (ప్లేయర్లను) తీసుకొచ్చాను. అయితే అది స్టేడియంలో బరిలోకి దిగేందుకు మాత్రమే. ఒకరేమో అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. మరొకరేమో సూపర్ బ్యాటర్. మరి ఫాస్ట్ బౌలర్ అంటే బలంగా ఉండాలి కదా. తెలివిగా వ్యవహరించాలి. ఆ రెండు గుణాలే మనోడిలో ఉన్నాయి. అతడి పేరే వైశాఖ్ విజయ్ కుమార్. ఇక రెండో రెసిపీకి కూడా ఎంతో ధైర్యం ఉంది. ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే. ఎప్పుడూ అతడిలో ఉత్సాహం ఉంటుంది. ఫుట్ వర్క్ మసాలా అద్భుతంగా ఉంటుంది. మంచి రుచికరమైన చట్నీ లాంటి ఏకాగ్రత, పసందైన పొడులుగా షాట్లు కొట్టే టైమింగ్ అతడిలో ఉన్నాయి. ఆ రెండో ఆటగాడి పేరే రమణ్ దీప్ సింగ్. కచ్చితంగా వీరిద్దరి నుంచి అద్భుతమైన ఆట వస్తుందని భావిస్తున్నాను" అని సూర్య పేర్కొన్నాడు. కాగా, మరి దూకుడుగా ఆడడం అలవాటైన ఈ యువ ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి.
తుది జట్లు (అంచనా)
టీమ్ ఇండియా : అభిషేక్, శాంసన్, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్, రింకు, అక్షర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్, అవేష్ ఖాన్, యశ్ దయాళ్.
దక్షిణా ఫ్రికా: రీజా, రికిల్‌టన్, మార్‌క్రమ్ (కెప్టెన్), క్లాసెన్, స్టబ్స్, మిల్లర్, యాన్సెన్, కేశవ్, ఎంగబా పీటర్, బార్ట్‌మన్, కొయెట్జీ.