IND VS Eng Test Series 2024 Srikar Bharat : టీమ్‌ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్, ఆంధ్రా కుర్రాడు శ్రీకర్ భరత్ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో కొనసాగుతున్నాడు. ఇప్పుడతడు బ్యాటర్‌గా మరో మ్యాచ్‌లో రాణించలేకపోతే మళ్లీ జట్టులో కనిపించడం కష్టమే అవుతుందనే సూచనలు కనిపిస్తున్నాయి.
గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌తో అతడు ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అయితే ఇప్పుడతడు ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్ మ్యాచ్ పూర్తయ్యేసరికి ఆడింది ఏడు మ్యాచ్‌లు. ఈ ఏడు మ్యాచులు కలిపి 20.09 యావరేజ్‌తో 221 పరుగులే చేశాడు. అత్యధిక వ్యక్తిగత సోరు 44. ఒక్క హాఫ్ సెంచరీ కూడా బాదలేదు.
నిజానికి 2023 ముందు టెస్టుల్లో టీమ్ఇండియాకు రెగ్యులర్ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ ఉండేవాడు. అతడు ప్రమాదంలో గాయపడి ఏడాదికి పైగా ఆటకు దూరం అవ్వడం వల్ల భరత్‌కు కలిసొచ్చింది. వికెట్ కీపింగ్ టాలెంట్, దేశవాళీ రికార్డ్ అతడికి టెస్ట్ టీమ్‌లో చోటు దక్కేలా చేసింది. అయితే అతడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
ఆస్ట్రేలియాతో ఆడిన తన తొలి టెస్టు సిరీస్‌లో, అనంతరం అదే ప్రత్యర్థి జట్టుతో ఆడిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లోనూ బ్యాటర్‌గా సరైన ప్రదర్శన చేయలేకపోయాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లోనూ సరిగ్గా ఆడలేకపోతున్నాడు. వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 41, 28, 17, 6 పరుగులు మాత్రమే చేశాడు. తన సొంతగడ్డ విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. దీంతో అతడిపై విమర్శలు పెరిగిపోతున్నాయి.
ఇప్పటికే జట్టులో ధ్రువ్ జురెల్ రూపంలో ఓ వికెట్ కీపర్ భరత్‌కు పోటీ ఉన్నాడు. పంత్ కూడా పునరాగమనానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో రాజ్ కోట్‌లో జరిగే మూడో టెస్టు భరత్‌కు ఎంతో కీలకంగా మారింది. అతడు బ్యాటుతో అదరగొట్టాల్సిందే. లేందటే సిరీస్ మధ్యలోనే అతడిని పక్కకు పెట్టి జురెల్‌ను తీసుకోవచ్చు. చూడాలి మరి భరత్ ప్రదర్శన ఎలా ఉంటుందో.
దేశవాళీల్లో అద్భుతంగా : అయితే శ్రీకర్ భరత్ దేశవాళీలో అద్భుతంగా రాణించాడు. రికార్డులు మంచిగా ఉన్నాయి. వికెట్ కీపర్ బ్యాటర్‌గా మెరుగైన ప్రదర్శనే చేశాడు. రంజీల్లో ఆంధ్రాకు మాత్రమే కాదు ఇండియా-ఎ, రెస్టాఫ్ ఇండియా లాంటి జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 96 మ్యాచ్‌ల్లో 36.69 యావరేజ్‌తో 5101 పరుగులు సాధించాజు. అందులో పది శతకాలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఓ ట్రిపుల్ సెంచరీ (308) కూడా ఉంది. ఇప్పుడు జరుగుతున్న ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ముందు కూడా ఇండియా-ఎకు ఆడుతూ ఇంగ్లాండ్ లయన్స్ జట్టుపై సెంచరీ (116) బాదాడు. కానీ ఇప్పుడేమో ఇంటర్నేషనల్ క్రికెట్లో దేశవాళీ ఫామ్‌ను కొనసాగించలేకపోతున్నాడు.
సొంతగడ్డపై అరుదైన రికార్డు - టీ20ల్లో 12 వేల పరుగుల మైల్స్టోన్ దాటిన వార్నర్
అండర్-19 వరల్డ్ కప్ : వీళ్లలో సీనియర్ జట్టు తలుపు తట్టేదెవరో?