IND VS ENG Test Series 2024 Debut players : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లీ, మూడో టెస్టులో గాయంతో కేఎల్ రాహుల్, శ్రేయస్ ఆడలేదు. దీంతో ఒకరిద్దరు మినహా బ్యాటింగ్ ఆర్డర్ అనుభవలేమితో నిండింది. కానీ సిరీస్‌లో 2-1తో టీమ్ ఇండియానే ఆధిక్యంలో నిలిచింది. ఇక సూపర్ ఫామ్‌లో ఉన్న ప్రధాన పేసర్ బుమ్రా కూడా నాలుగో టెస్టు రెస్ట్ తీసుకున్నాడు. అయినా తొలి సెషన్లోనే ఐదు వికెట్లు పడ్డాయి. మరి ఇంగ్లిష్ జట్టుపై ఈ ఆధిపత్యానికి ప్రధాన కారణం ఏంటంటే టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్స్. ఈ సిరీస్‌లో అరంగేట్రం చేసిన కుర్రాళ్లు తమకొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ అదరగొడుతున్నారు. తమ అద్భుత నైపుణ్యాలతో జట్టు భవిష్యత్‌పై భరోసాను కల్పిస్తున్నారు.
వర్క్ లోడ్ కారణంగా నాలుగో టెస్టులో బుమ్రాకు విశ్రాంతినిచ్చిన మేనెజ్మెంట్ యువ పేసర్ ఆకాశ్‌దీప్‌కు అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశాన్ని ఇచ్చింది. దీంతో ఈ పేసర్ వచ్చీ రాగానే సత్తా చాటాడు. బౌన్స్, స్వింగ్‌తో ఇంగ్లాండ్ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. నిప్పుల్లాంటి బంతులతో చెలరేగుతూ రెండు ఓవర్ల వ్యవధిలోనే ఇంగ్లాండ్ టాప్-3 బ్యాటర్లను పెవిలియన్ పంపాడు. నిలకడగా ఒకే లెంగ్త్‌లో బంతులు సంధించి వికెట్లను తీశాడు. అలా గొప్పగా బంతులేసిన 27 ఏళ్ల ఈ బెంగాల్ పేసర్ 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచులు ఆడి 23.58 యావరేజ్‌తో 104 వికెట్లు పడగొట్టాడు. 28 లిస్ట్- ఎ మ్యాచ్‌ల్లో 24.50 యావరేజ్‌తో 42 వికెట్లు, 41 టీ20 మ్యాచ్‌ల్లో 22.81 సగటుతో 48 వికెట్లను దక్కించుకున్నాడు.
ఈ సిరీస్‌లో ఆకాశ్ దీప్తో పాటు ఇప్పటికే నలుగురు భారత ఆటగాళ్లు కూడా ఈ సుదీర్ఘ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చారు. విశాఖలో జరిగిన రెండో టెస్టులో ఛాన్స్ దక్కించుకున్న రజత్ పటీదార్ తన తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత మూడు ఇన్నింగ్స్‌లో అవకాశాలను వృథా చేసుకున్నాడు. కానీ అత్యున్నత స్థాయిలో ఆడే ప్రతిభ ఉందనే సంకేతాలను పంపించాడు.
Sarfaraz Khan Test series : రాజ్ కోట్లో జరిగిన మూడో మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జూరెల్ అరంగేట్రం చేశారు. దేశవాళీ క్రికెట్లో మంచిగా రాణిస్తున్నప్పటికీ టీమ్ ఇండియాలో చోటు దక్కించుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అవకాశాన్ని అందుకున్న అతడు వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలతో మెరిశాడు. అరంగేట్ర టెస్ట్‌లోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు బాదిన నాలుగో భారత ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు.
మరోవైపు వికెట్ కీపర్ ధ్రువ్ కూడా మస్త్‌గా రాణించాడు. 23 ఏళ్ల ఈ ఉత్తరప్రదేశ్ ప్లేయర్ తన తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులతో మంచి ప్రదర్శన చేశాడు. ఓపికతో క్రీజులో ఉండి ఉత్తమ పరిణతిని చూపించాడు. ఇలా కుర్రాళ్లు అరంగేట్రంలోనే వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంటున్నారు.
జడ్డు దెబ్బకు ఇంగ్లాండ్ హడల్ - 353 పరుగులకు ఆలౌట్
గ్రాండ్‌గా WPL ప్రారంభం- స్పెషల్ అట్రాక్షన్‌గా బాలీవుడ్ స్టార్స్ పెర్ఫార్మెన్స్