Ind vs Eng Semi Final 2024: 2024 టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమ్ఇండియా సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. గత దశాబ్ద కాలంగా నాకౌట్ మ్యాచ్‌ల్లో తడబడుతున్న భారత జట్టు ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని భావిస్తోంది. 2022 టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన టీమ్ఇండియా ఈసారి సెమీస్‌లో గెలిచి అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని కృతనిశ్చయంతో ఉంది.
ప్రస్తుత టీ20ప్రపంచకప్‌లో భారత జట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. గతంలో అనుసరించిన సంప్రదాయ విధానాన్ని పక్కనబెట్టి దూకుడైన ఆటతీరుతో టీమిండియా ఈ టోర్నీలో దుమ్మురేపుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి సూపర్- 8 మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 41 బంతుల్లోనే 92 రన్స్ చేసి ఆకాశమే హద్దుగా చెలరేగగా రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హర్దిక్ పాండ్య కూడా ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసి వచ్చే అంశం. ఐతే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో పేలవమైన ఫామ్‌తో సతమతమౌతుండటం రోహిత్ సేనను కలవరపెడుతోంది.
ఓపెనర్‌గా వస్తున్న విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. దాదాపుగా రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీకి ఇదే చివరి టీ20 ప్రపంచకప్ కావడంతో భారత్‌కు ట్రోఫీ అందించి తమదైన మార్క్ వేయాలని ఇరువురు క్రికెట్ దిగ్గజాలు కోరుకుంటున్నారు. వ్యక్తిగత మైలురాళ్లను పట్టించుకోకుండా ఇప్పటికే రోహిత్ శర్మ చెలరేగి ఆడుతున్నాడు. మిడిల్‌ఆర్డర్‌లో శివమ్ దూబే స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చేందుకు రోహిత్ ఇష్టపడకపోతే అదేజట్టుతో ఇంగ్లాండ్‌పై మ్యాచ్‌లో కూడా భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్‌పటేల్‌తో పాటు స్పెషలిస్ట్ స్పిన్నర్ కులదీప్ యాదవ్ జట్టుకు అండగా నిలుస్తున్నారు. పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ సత్తా చాటుతుండటం టీమిండియాకు కలిసి వచ్చే అంశం. హర్దిక్ పాండ్యా తన ఆల్‌రౌండ్ ప్రతిభను కొనసాగించాలని భారత జట్టు కోరుకుంటోంది.
మరోవైపు ఈ టోర్నీలో ఇంగ్లాండ్ ప్రదర్శన అంత అద్భుతంగా లేదు. గ్రూప్ దశలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన ఇంగ్లాండ్ సూపర్-8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయంపాలైంది. అమెరికాపై మ్యాచ్‌లో సత్తా చాటడం ద్వారా ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. మ్యాచ్ స్వరూపాన్ని ఒక్కసారిగా మార్చివేయగల మరో ఓపెనర్ ఫిల్‌సాల్ట్‌ను భారత్ పవర్‌ప్లే ఓవర్లలోనే అవుట్ చేయాల్సి ఉంటుంది. బెయిర్‌స్టో, మెయిన్ అలీ నుంచి కూడా ఇంగ్లాండ్ భారీ స్కోర్ ఆశిస్తోంది. స్పిన్నర్ అదిల్ రషీద్ వేసే 4 ఓవర్లు ఆ జట్టుకు కీలకంగా మారనున్నాయి. పేసర్ జోఫ్రా ఆర్చర్ ఈ టోర్నీలోని ఏడు మ్యాచ్‌ల్లోనూ మెరుగ్గా రాణించాడు.
అమెరికాపై హ్యాట్రిక్‌తో సత్తా చాటి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న జోర్డాన్ కొత్త బంతితో రోహిత్, కోహ్లీని ఇబ్బంది పెట్టాలని భావిస్తున్నాడు. మ్యాచ్ వేదికైన గయానాలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. రెండో సెమీఫైనల్‌కు రిజర్వ్ డే లేదు. కానీ 250 నిమిషాల అదనపు సమయం కేటాయించారు. సెమీస్‌లో ఫలితం తేలాలంటే రెండు జట్లు కనీసం 10 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. అసలు వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే అధిక ర్యాంక్ జట్టు ఫైనల్‌కు వెళుతుంది. అంటే భారత్ నేరుగా ఫైనల్‌కు చేరుతుంది.
2024 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్- భారత్ x పాక్ మ్యాచ్ ఎప్పుడంటే? - Asia Cup 2024 Schedule
టీమ్ఇండియాxఇంగ్లాండ్ - రెండో సెమీస్‌కు రిజర్వ్ డే ఎందుకు లేదంటే? - T20 World cup 2024