Teamindia VS Bangladesh Test Series : టీమ్ ఇండియా మళ్లీ టెస్ట్ సమరానికి సిద్ధమవుతోంది. చివరిగా ఈ ఏడాది మార్చిలో టెస్టు మ్యాచ్ ఆడింది. మళ్లీ ఆ తర్వాత ప్లేయర్స్ రెండు నెలల పాటు ఐపీఎల్‌తో బిజీ అయిపోయారు. అనంతరం టీ20 వరల్డ్ కప్ ఆడారు. ఆపై శ్రీలంకలో టీ20, వన్డే సిరీస్‌ల్లో ఆడారు.
అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆర్నెళ్ల తర్వాత మళ్లీ ఎర్ర బంతితో మ్యాచ్ ఆడేందుకు సన్నద్ధమవుతున్నారు. శ్రీలంక పర్యటన అనంతరం నెల రోజుల తర్వాత బ్యాట్ పట్టనున్నారు. ముందుగా ఈ నెల 19 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనున్నారు. ఆ తర్వాత కూడా స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ ఆడతారు. అనంతరం ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లి తలపడతారు.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ సిరీస్ ముంగిట టీమ్ ఇండియా తమ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేసింది. చెన్నైలో వచ్చే గురువారం నుంచి మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్టులోని ప్రధాన ప్లేయర్స్ చెన్నైకి చేరుకుని సాధన కూడా చేస్తున్నారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లండన్ నుంచి చెన్నైకి చేరుకోగా, రోహిత్ ముంబయి నుంచి చెన్నైకు చేరుకున్నారు.
కోహ్లీ అయితే 45 నిమిషాల పాటు నెట్స్‌లో చెమటోడ్చాడు. బ్రేక్ లేకుండా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఫాస్ట్ బౌలర్ బుమ్రా కూడావేగంతో బంతులు సంధిస్తూ ప్రాక్టీస్ చేశాడు. ఇక మిగతా ప్లేయర్స్‌లో కొంతమంది ప్రాక్టీస్‌కు హాజరు అవ్వగా, మరి కొందరు హోటల్ రూమ్‌కే పరిమితమయ్యారు.
🧵 Snapshots from #TeamIndia's training session in Chennai ahead of the 1st Test against Bangladesh.#INDvBAN pic.twitter.com/nqg94A73ju
— BCCI (@BCCI) September 13, 2024
అరుదైన రికార్డ్‌కు అడుగు దూరంలో(Teamindia Test wins) - ఈ సుదీర్ఘ ఫార్మాట్(టెస్టు క్రికెట్)లో ఇప్పటివరకు 579 మ్యాచ్‌లను ఆడిండి టీమ్ ఇండియా. ఇందులో 178 మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్ జట్టు, సరిగ్గా 178 మ్యాచుల్లో ఓడిపోయింది. మిగిలిన 223 మ్యాచుల్లో 222 మ్యాచ్‌లు డ్రాగా ముగియగా ఒక మ్యాచ్ టైగా ముగిసింది. అంటే చెన్నై వేదికగా ఈ నెల 19 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టులో గెలిస్తే, టెస్టు క్రికెట్‌లో ఓటములు కన్నా విజయాలను ఎక్కువగా అందుకున్న నాలుగో జట్టుగా టీమ్ ఇండియా రికార్డుకు ఎక్కుతుంది. ఇప్పటి వరకు ఈ రికార్డ్‌ను భారత్ టచ్ చేయలేదు. ఒకవేళ ఈ రికార్డ్‌ను టచ్ చేస్తే 1932 తర్వాత ఇదే తొలిసారి అవుతుంది. అంటే 92 ఏళ్లలో ఇదే తొలి సారి అవుతుందన్న మాట.
ఇకపోతే టెస్టు క్రికెట్ చరిత్రలో ప్రస్తుతం నాలుగు జట్ల మాత్రమే ఓటముల కన్నా ఎక్కువ విజయాల్ని అందుకున్నాయి. ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 866 టెస్టులు ఆడగా 414 విజయాలు, 232 ఓటములను అందుకుంది. ఇంగ్లాండ్ 1077 టెస్టులు ఆడగా 397 విజయాలు, 325 ఓటములను ఖాతాలో వేసుకుంది.
దక్షిణాఫ్రికా 466 టెస్టులు ఆడి, 179 విజయాలు, 161 ఓటములతో మూడో స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ 458 టెస్టులు ఆడగా, 148 విజయాలు, 144 ఓటములతో నాలుగో స్థానంలో నిలిచింది.