Gambhir First Impression On Dhoni : టీమ్ ఇండియాకు దిగ్గజ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, గౌతమ్ గంభీర్ ప్రాతినిథ్యం వహించారు. వీరిద్దరూ కలిసి భారత జట్టుకు చాలా విజయాలను అందించారు. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో ధోనీ, గౌతీ 109 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అలాగే మహీ, గంభీర్ ఇద్దరు ఆన్ ఫీల్డ్, ఆఫ్ పీల్ట్ కూడా మంచి మిత్రులే. ఇటీవలే ఓ షోలో పాల్గొన్న భారత జట్టు హెచ్ కోచ్ గంభీర్ తనకు ధోనీపై ఏర్పడిన ఫస్ట్ ఇంప్రెషన్‌ను, అతడితో ఉన్న స్నేహా బంధాన్ని గుర్తు చేసుకున్నాడు.
పాకిస్థాన్ పై ధోనీ విధ్వంసం - ధోనీ, తాను ఇండియా ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించామని గంభీర్ చెప్పుకొచ్చాడు. మహీ మొదటిసారి గ్లౌవ్స్ వేసుకోని కీపింగ్ చేయడం, బ్యాటింగ్ ఇంకా తనకు గుర్తుందని తెలిపాడు. ముక్కోణపు సిరీస్‌లో ధోనీ పాకిస్థాన్ ఏ జట్టుపై రెండు సెంచరీలు, ఒక అర్ధ శతకం బాదాడని పేర్కొన్నాడు. ధోనీ అద్భుతమైన నాక్స్ వల్ల అతడికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడని వివరించాడు.
"ఇండియా ఏ జట్టు తరఫున ధోనీ, నేను కెన్యా, జింబాబ్వే పర్యటనకు వెళ్లాము. పాకిస్థాన్ ఏ, కెన్యాతో ముక్కోణపు సిరీస్ ఆడాం. ధోనీ బలంగా బంతిని కొట్టగలడని, వికెట్‌ను కాపాడుకుని భారీ హిట్టింగ్ చేయగలడని జట్టు సభ్యులందరికీ తెలుసు. మహీ కీపింగ్, బ్యాటింగ్ స్కిల్స్ చూసి భయపడ్డాను. అప్పుడే ధోనీపై ఫస్ట్ ఇంప్రెషన్ ఏర్పడింది. అప్పటికే టీమ్ ఇండియాకు వికెట్ కీపర్లు ఉన్నారు. అయితే 100 మీటర్ల దూరంలో సిక్సర్లు కొట్టగలిగే హార్డ్ హిట్టర్లు లేరు. ధోనీ అద్భుతమైన ఆటగాడు." అని గంభీర్ వ్యాఖ్యానించాడు.
అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో అత్యుత్తమ కెప్టెన్ ధోనీ అని ప్రశంసించాడు గంభీర్. భారత్ తరఫున మహీ సాధించిన రికార్డును అందుకోవడం చాలా కష్టమని అన్నాడు. "ఎంతో మంది కెప్టెన్లు వస్తారు, వెళ్తారు. భారత జట్టులో ధోనీ రికార్డును అందుకోవడం చాలా కష్టం. టెస్ట్‌లలో నెం.1 ర్యాంక్ అందుకోవచ్చు, విదేశీ మ్యాచ్‌లను గెలవొచ్చు కానీ, రెండు ఐసీసీ ప్రపంచ కప్‌లను, ఓ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అందుకోవడం ఎంతో ప్రత్యేకం అనే చెప్పాలి. ఇంత కంటే గొప్ప విజయం మరొకటి లేదు." అని చెప్పుకొచ్చాడు.
టీమ్ ఇండియా సక్సెస్ ఫుల్ కెప్టెన్ - కాగా, మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమ్ ఇండియా ఐసీసీ వన్డే ప్రపంచ కప్ (2011), టీ 20 ప్రపంచ కప్ (2007), ఛాంపియన్స్ ట్రోఫీ (2013) గెలుచుకుంది. భారత జట్టుకు మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా ధోనీ పేరు పొందాడు. కీపింగ్ లోనూ తనదైన ముద్ర వేశాడు. కూల్‌గా ఉంటూ జట్టు విజయానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకోవడంలో ధోనీ దిట్ట అని చెప్పొచ్చు.
గంభీర్‌కు మొదలైన అసలు 'టెస్టు' - ఆ బాధ్యత మనోడిదే! - IND VS BAN Gambhir Strategy