IND Vs BAN 3rd T20 : బంగ్లాపై భారత్ ఘన విజయం సాధించింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థిని 133 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. చివరి టీ20లోనూ విజయఢంకా మోగించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. 298 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లా బోల్తా కొట్టింది. లిటన్‌దాస్ (42), హిర్దోయ్ (63*) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు.
సంజూ ఫస్ట్ సెంచరీ
ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ శాంసన్ ఆది నుంచే దూకుడుగా ఆడాడు. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ చేలరేగిపోయాడు. అలా 47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 111 పరుగులతో జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందించాడు. ఇక సంజూతో పాటు సూర్యకుమార్ యాదవ్(75) కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగుల టార్గెట్‌ను బంగ్లా ముందు ఉంచింది. అయితే టీ20 కెరీర్‌లో సంజు శాంసన్‌కి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఇక బంగ్లా బౌలర్లలో షకీబ్ 3 వికెట్లు తీయగా, తస్కిన్, మహ్మదుల్లా, ముస్తఫిజుర్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
బౌలింగ్‌లోనూ భారత్ అదుర్స్
భారత్ తమ ముందు ఉంచిన టార్గెట్‌ను బంగ్లాదేశ్ జట్టు చేధించలేకపోయింది. దానికి కారణం మన బౌలర్లు. వాళ్లు వేసిన బంతులకు బంగ్లా విలవిల్లాడిపోయింది. ఫలితంగా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులే స్కోర్ చేయగలిగింది. అయితే ఆ టీమ్‌లో తోవిడ్ హ్రిడోయ్ మాత్రమే 63 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లిట్టన్ దాస్ కూడా 42 పరుగులు చేసినప్పటికీ బంగ్లా విజయం సాధించలేకపోయింది. ఇక భారత్ బౌలర్లలో రవి బిష్ణోయ్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా, మయాంక్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. వీరితో పాటు వాషింగ్టన్ సుందర్, నితీశ్ రెడ్డికి చెరో వికెట్ సాధించారు. ఇదిలా ఉండగా, ఈ వేదికగా భారత్ టీ20ల్లోనే రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది. అయితే, నేపాల్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డుకు (314) కాస్త దూరంలో నిలిచింది.
ఉప్పల్‌లో టీమ్ఇండియా ఊచకోత- శాంసన్ సెంచరీ- టీ20ల్లోనే అత్యధిక స్కోరు