ICC Test Rankings Rohith Sharma Kohli : తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది ఐసీసీ. ఈ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ టాప్-30లో కూడా నిలవలేదు. ఆరు స్థానాలు దిగజారి ఏకంగా 31వ స్థానానికి పడిపోయాడు. ఆరేళ్ల తర్వాత తొలిసారి హిట్ మ్యాన్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఇలా టాప్ -30లో నిలవలేదు. ఇక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఐదు స్థానాలు కిందకు పడిపోయి 20వ ర్యాంకులో నిలిచాడు.
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతోన్న ఐదు టెస్టుల సిరీస్‌లో టీమ్ ఇండియా బ్యాటర్లు పెద్దగా స్కోర్లు చేయడం లేదు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంచనాలకు తగ్గట్లుగా రాణించకపోవడంతో ఈ ప్రభావం వారి ఐసీసీ ర్యాంకులపై పడింది.
ఇక యశస్వి జైస్వాల్ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా, రిషభ్ పంత్ మూడు స్థానాలు దిగజారి 9వ ర్యాంకులో నిలిచాడు. శుభ్‌మన్ గిల్ మాత్రం ఒక స్థానం మెరుగుపరుచుకుని 17వ స్థానంలో నిలిచాడు. నితీశ్ కుమార్ రెడ్డి మాత్రం ఆరు స్థానాలు ఎగబాకి 69వ ర్యాంకును దక్కించుకున్నాడు.
ఇంగ్లాండ్ యంగ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 898 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఒక్క పాయింట్ తేడాతో జో రూట్ (897) రెండో స్థానాన్ని సరిపెట్టుకున్నాడు. ఇక టీమ్ ఇండియాతో జరిగిన పింక్ టెస్టులో భారీ సెంచరీ బాదిన ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ టాప్-10లోకి దూసుకొచ్చాడు. ఆరు స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంకును దక్కించుకున్నాడు.
బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా అగ్ర స్థానంలో కొనసాగుతుండగా, అశ్విన్ ఒక స్థానం కిందకు దిగి ఐదులో, రవీంద్ర జడేజా ఆరో స్థానంలో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలో పెద్దగా మార్పులేమీ జరగలేదు.
ఇకపోతే ఆస్ట్రేలియా, టీమ్ ఇండియా మధ్య 5 మ్యాచుల సిరీస్ జరగుతోన్న సంగతి తెలిసిందే. మొదటి టెస్ట్‌లో టీమ్ ఇండియా విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో ఆసీస్ గెలుపొందింది. ఇక మూడో టెస్టు గబ్బా స్టేడియం వేదికగా డిసెంబరు 14న మొదలు కానుంది.
ఆసక్తిగా మారిన WTC పాయింట్ల పట్టిక - టాప్ 1కు భారత్ చేరాలంటే సమీకరణాలు ఇలా!
గూగుల్ 2024 ట్రెండ్స్ - అగ్రస్థానంలో ఐపీఎల్ - ఇంకా ఏ మ్యాచ్‌ల కోసం వెతికారంటే?