ICC Champions Trophy 2025 : ఇండియా, పాకిస్థాన్ ప్రస్తుతం కేవలం ఐసీసీ ఈవెంట్స్‌లో మాత్రమే పోటీ పడుతున్నాయి. భద్రత కారణాల దృష్ట్యా భారత్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించడం లేదు. రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఇరు దేశాల ప్రజలే కాదు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా చూస్తారు. త్వరలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా వర్సెస్ పాక్ పోరు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే వచ్చే ఏడాది పాక్‌లో జరుగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ఇండియా టీమ్ పాక్‌లో అడుగుపెడుతుందనే వార్తలు వస్తున్నాయి.
2025లో జరుగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే టోర్నీలో భారత్ క్వాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్‌లను ఒకే నగరంలో నిర్వహించాలని తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారులు కోరినట్లు తెలిసింది. కరాచీ నగరంలో ఈ మ్యాచ్‌లు షెడ్యూల్ చేయాలని సూచించినట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మూడు నగరాలను ఎంచుకుంది. అందులో కరాచీ, రావల్పిండి, లాహోర్ నగరాలు ఉన్నాయి. ఈ మూడు వేదికల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి.
పాక్‌లో ఐసీసీ జీఎం పర్యటన
"ఐసీసీ జనరల్ మేనేజర్ వసీం ఖాన్ ఇటీవల లాహోర్‌కు వచ్చారు. అక్కడ అతను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఉన్నతాధికారులతో ఛాంపియన్స్ ట్రోఫీ ఏర్పాట్లపై చర్చించారు. భారత జట్టు వీలైనంత తక్కువగా ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని సూచించిచారు." అని ఓ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారి పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. నాకౌట్‌లకు వెళ్లే ముందు కరాచీలో భారత్ తన ప్రారంభ క్వాలిఫైయింగ్ రౌండ్ గేమ్‌లను ఆడవచ్చని తెలిసింది.
ముంబయి దాడుల నేపథ్యంలో భారత్, పాక్ మధ్య చాలా కాలంగా ద్వైపాక్షిక సిరీస్‌లు రద్దయ్యాయి. భారత క్రికెట్ జట్టు 2008 నుంచి పాకిస్థాన్‌లో ఆడలేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే దాయాది దేశాలు తలపడుతున్నాయి. గత సంవత్సరం, భారత క్రికెట్ బోర్డు ఆసియా కప్ కోసం జాతీయ జట్టును పంపలేదు. చివరికి టోర్నీ పాక్, శ్రీలంకలో హైబ్రిడ్ మోడల్‌లో జరిగింది.
షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు?
అయితే షెడ్యూల్ ప్రకారం అన్ని జట్లు పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతాయని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తెలిపారు. టోర్నమెంట్‌ను 2025 ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించాలని భావిస్తున్నందున స్టేడియం రెనోవేషన్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు.