ICC Champions Trophy 2025 PCB : పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగడంపై ఇంకా సస్పెన్స్ వీడడం లేదు. ట్రోఫీలో ఆడేందుకు పాక్ వెళ్లేదే లేదని ఇప్పటికే బీసీసీఐ తేల్చిచెప్పింది. హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్‌లు నిర్వహించాలని ఐసీసీని కోరింది. ఈ మేరకు హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్‌లు నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ సూచించింది. అందుకు పీసీబీ మాత్రం ససేమిరా అని పట్టుదలగా ఉంది. అయితే ఈ ప్రధాన టోర్నీని ఐసీసీ వాయిదా వేసినా, వేరే దేశానికి అతిథ్య హక్కులు ఇస్తే దాని ఫలితం పాకిస్థాన్‌పై తీవ్ర ఆర్థిక భారం పడేలా చేయనుంది.
రూ.55కోట్లు నష్టం!
ఛాంపియన్స్ ట్రోఫీ వాయిదా పడినా, మరొక దేశానికి ఆతిథ్య హక్కులు దక్కినా పాకిస్థాన్ భారీగా నష్టపోనుంది. ఐసీసీ నిధులను కోల్పోనుంది. అలాగే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుంచి ఆంక్షలను ఎదుర్కొనున్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ మెగా టోర్నీ పాక్ నుంచి తరలిపోవడం లేదా వాయిదా పడితే పీసీబీకి హోస్టింగ్ ఫీజులో 65 మిలియన్ డాలర్ల(రూ.55 కోట్లు) నష్టం వాటిల్లనున్నట్లు కథనాలు వస్తున్నాయి.
నష్టం మరింత పెరిగే ఛాన్స్!
అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను కరాచీ, రావల్పిండి, లాహోర్ స్టేడియాల్లో నిర్వహించేందుకు పీసీబీ ప్లాన్ చేస్తోంది. అందుకే ఈ మూడు స్టేడియాల్లో మౌలిక సదుపాయాల కోసం భారీగా ఖర్చు చేసింది. దీంతో నష్టం మరింత వాటిల్లే అవకాశం ఉంది.
అందుకే షెడ్యూల్ ఆలస్యం!
వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీకి టీమ్ఇండియాను పంపమని బీసీసీఐ ఇప్పటికే పీసీబీకి స్పష్టం చేసింది. హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్‌ల నిర్వహణకు పాక్ అంగీకరించకపోవడం, పాక్ వెళ్లేందుకు భారత్ నిరాకరించకపోవడం వల్ల టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్‌కు రాకపోవడంపై ఐసీసీ తమకు స్పష్టమైన రాతపూర్వక ప్రతిస్పందన ఇవ్వాలని పీసీబీ కోరినట్లు తెలుస్తోంది. 1996 తర్వాత తొలిసారిగా గ్లోబల్ ఐసీసీ ఈవెంట్‌ను నిర్వహించేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో టోర్నీ వాయిదా పడినా, వేదిక మార్పు జరిగినా పాకిస్థాన్ భారీ నష్టపోతుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ - పీసీబీ వైఖరిపై పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం!