Champions Trophy 2025 Hybrid Model : ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై కొనసాగుతోన్న సందిగ్ధతకు తెరపడినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైబ్రిడ్ మోడల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు ఐసీసీ ఆమోదం తెలిపినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి.
భారత్ ఆడే మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా నిర్వహించాలని, ఐసీసీ చేసిన ప్రతిపాదనకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంగీకారం తెలిపినట్లు సమచారం. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
వాస్తవానికి ఈ ఛాంపియన్స్ 2025 టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ గత నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మధ్య నెలకొన్న విభేదాల కారణంగా షెడ్యూల్ రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు తమ జట్టును పంపలేమని, హైబ్రిడ్ మోడల్‌కు అయితే ఓకే అని బీసీసీఐ చెబుతుండగా, పాకిస్థాన్ మాత్రం టీమ్ ఇండియా తమ దేశానికి రావాలంటూ పట్టుబట్టింది. హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వహణకు కుదరదని, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దేశంలోనే పూర్తి టోర్నీ జరగాలని మొండిగా ప్రవర్తించింది. అందుకే గత కొద్ది రోజులుగా ఈ అంశంపై వివాదం కొనసాగుతోంది. దీంతో పీసీబీని ఒప్పించేందుకు గత కొన్ని రోజులుగా ఐసీసీ ప్రయత్నాలు చేస్తోంది. అలా సుదీర్ఘ మంతనాలు, సమావేశాల అనంతరం హైబ్రిడ్ మోడల్‌లోనే టోర్నీ నిర్వహించేలా ఐసీసీ తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఇకపోతే భారత్, శ్రీలంక సంయుక్త వేదికల్లో టీ20 వరల్డ్ కప్ 2026 జరగనుంది. అయితే ఈ టోర్నీలో పాల్గొనేందుకు భారత్‌కు వెళ్లబోమని, తమ మ్యాచ్‌లను శ్రీలంకలోనే నిర్వహించాలని తాజా సమావేశంలో పాకిస్థాన్ పట్టుబట్టినట్లు తెలిసింది. దీంతో ఈ టోర్నీలో పాకిస్థాన్ ఆడే లీగ్ దశ మ్యాచ్‌లు శ్రీలంకలోనే నిర్వహించేందుకు ఐసీసీ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం.