Hardik Pandya Comeback: టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సుమారు ఐదు నెలల గ్యాప్ తర్వాత బరిలోకి దిగాడు. డీవై పాటిల్ (DY Patil T20) టీ20 టోర్నమెంట్ 18వ సీజన్లో పాండ్య పాల్గొన్నాడు. ఈ టోర్నీలో అతడు రిలయన్స్ 1 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. టోర్నీలో భాగంగా సోమవారం (ఫిబ్రవరి 26) బీపీసీఎల్ (BPCL)తో జరిగిన మ్యాచ్‌లో పాండ్య సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. 2023 వరల్డ్‌కప్ తర్వాత తొలిసారి బరిలోకి దిగిన పాండ్య ఈ మ్యాచ్‌లో పూర్తి ఫిట్‌గా కనిపించాడు. ఇక ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో సత్తా చాటిన పాండ్య తన టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన పాండ్య తొలి రెండు ఓవర్లోలో ఏకంగా 21 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే మూడో ఓవర్లో మాత్రం పాండ్య సత్తా చాటాడు. ఈ ఓవర్లో కేవలం 1 పరుగే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్రత్యర్థి జట్టు బీపీసీఎల్ 18.3 ఓవర్లలో 126 పరుగులకు కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో రిలయన్స్ 15 ఓవర్లలో వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. ఇన్నింగ్స్ ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన పాండ్య 4 బంతుల్లో 3 పరుగులు బాది నాటౌట్‌గా నిలిచాడు.
అయితే 2023 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో పాండ్య గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో పాండ్య కాలికి తీవ్రమైన గాయం అవ్వడం వల్ల అప్పట్నుంచి ఆటకు దూరమయ్యాడు. ఎన్సీఏ (National Cricket Academy)లో మెల్లి మెల్లిగా కోలుకున్న పాండ్య రీసెంట్గా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. 2024 ఐపీఎల్లో ఆడడమే లక్ష్యంగా పాండ్య నెట్స్‌లో కసరత్తులు షురూ చేశాడు. ఈ నేపథ్యంలో సోమవారం పాండ్య బరిలోకి దిగడం వల్ల 2024 ఐపీఎల్, టీ20 వరల్డ్‌కప్‌నకు సిద్ధమయ్యాడని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
Hardik Pandya IPL: 2024లో హార్దిక్ ముంబయి ఇండియన్స్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. గత రెండ సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన పాండ్య ఈసారి తిరిగి ముంబయి తరఫున ఆడనున్నాడు. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.