Graham Thorpe Comitted Suicide : ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, మాజీ కోచ్ గ్రాహమ్ థోర్ప్(55) ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. అతడు తుదిశ్వాస విడిచినట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అప్పుడు తెలిపింది. కానీ సరైన కారణం ఏమీ చెప్పలేదు. గ్రాహమ్ ఎలా చనిపోయాడో అతడి కుటుంబం కూడా చెప్పలేదు. అయితే తాజాగా గ్రాహమ్ థోర్ప్ భార్య అతడి మరణానికి గల కారణాన్ని తెలిపింది. గ్రాహమ్ చాలా కాలం నుంచి డిప్రెషన్, యాంక్సైటీ వంటి సమస్యలతో బాధపడినట్లు చెప్పింది. బలవన్మరణానికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చింది!
"ఎంతగానో ప్రేమించే మేము అతడితో ఉన్నప్పటికీ ఆరోగ్యం బాగుపడలేదు. ఈ మధ్య కాలంలో చాలాసార్లు అనారోగ్యంతో బాధపడ్డాడు. ఇక చివరికి తాను లేకుంటేనే మేం మంచిగా ఉంటామని అతడు భావించాడు. అందుకే అతడు తన ప్రాణాలను తానే తీసుకున్నాడు. అది మమ్మల్ని ఎంతగానో బాధించింది. నిజానికి అతడు కొన్నేళ్లుగా తీవ్రంగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. యాంక్సైటీతోనూ ఎంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడు 2022లో బలవన్మరణానికి యత్నించాడు. అది అతడి జీవితంపై చాలా ప్రభావం చూపింది. చాలా కాలం పాటు అతడు ఐసీయూలోనే ఉండాల్సి వచ్చింది. దీంతో అతడు నిరాశలో కూరుకుపోయాడు. మా కుటుంబమంతా అతడికి ఎంతో సపోర్ట్‌గా నిలిచాం. అతడి ఆరోగ్యం బాగుపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం. చికిత్సలు చేయించాం. కానీ దురదృష్టవశాత్తు ఇవేమీ అతడిని కోలుకునేలా చేయలేకపోయాయి." అని చెప్పుకొచ్చింది. కాగా, గ్రాహమ్ థోర్ప్‌కు(Graham Thorpe Family members) భార్య అమంద థోర్ప్తో పాటు ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
Graham Thorpe Career : 1993 నుంచి 2005 వరకు ఇంగ్లాండ్ తరఫున 100 టెస్టులు ఆడాడు గ్రాహమ్ థోర్ప్. ఈ ఫార్మాట్లో 6,774 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు ఉన్నాయి. అలానే 82 వన్డేల్లోనూ దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత అఫ్గానిస్థాన్‌కు (2022లో) కోచ్‌గానూ సేవలు అందించాడు. కానీ అనారోగ్య కారణాల వల్ల మధ్యలోనే వైదొలిగాడు.