Gautam Gambhir IND Vs NZ Test Series : సొంత గడ్డపై టెస్టుల్లో తాజాగా ఎదురైన పరాభవం టీమ్ఇండియా ఊహించని విషయం. అత్యుత్తమ పెర్ఫామెన్స్ ఇవ్వడంలో భారత బ్యాటర్ల ఘోరంగా విఫలం అవ్వడం వల్ల కివీస్ చేతిలో ఈ టెస్టు సిరీస్‌ను ఓడాల్సి వచ్చిందని క్రికెట్ వర్గాల మాట. స్వదేశంలో తిరుగులేదని భావించిన భారత్‌కు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి.
మరోవైపు టీమ్‌తో పాటు తాజాగా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్‌కు ఈ ఓటమి ఊహించని విధంగా షాకిచ్చింది. ఈ నేపథ్యంలో గంభీర్ తాజాగా జట్టుపై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సీనియర్లకు ఇస్తోన్న 'ఆప్షనల్ ట్రైనింగ్' సెషన్ అవకాశాన్ని కూడా ఈ చర్యల్లో భాగంగా రద్దు చేసినట్లు సమాచారం.
అసలు ఏంటీ 'ఆప్షనల్ ట్రైనింగ్' ?
ఏదైనా సిరీస్‌కు ముందు ప్రాక్టీస్‌లో భాగంగా ప్లేయర్లకు ట్రైనింగ్ సెషన్లు నిర్వహిస్తుండటం సహజం. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి టాప్ స్టార్లకు ఇది ఆప్షనల్‌గా ఉండేది. ప్రాక్టీస్‌లో వీరు గాయపడితే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం, అలాగే వ్యక్తిగత పనుల నిమిత్తం వారికి విశ్రాంతినిచ్చేవాళ్లు. కానీ ఇప్పుడీ ఓటమి వల్ల ఇక నుంచి ప్రతి ప్లేయర్ ఆ సెషన్‌కు హాజరు కావాల్సిందేనంటూ మేనేజ్‌మెంట్ తాజాగా పేర్కొన్నట్లు తెలుస్తోంది.
"మూడో టెస్టు ప్రారంభానికి ముందు ఓ రెండు రోజుల ట్రైనింగ్ సెషన్‌ను నిర్వహించాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అక్టోబర్ 30-31 వరకు ఈ సెషన్ జరగనుంది. దీనికి ప్రతి ఒక్కరూ హాజరు కావల్సిందేనని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఎవరూ కూడా ఈ సెషన్‌ను మిస్ కావద్దు. టాప్ ఆటగాళ్లు కూడా రావాల్సిందే" అని మేనేజ్‌మెంట్ పేర్కొన్నట్లు క్రికెట్ వర్గాలు తాజాగా వెల్లడించాయి.
మరోవైపు కివీస్‌తో మూడో టెస్టు నవంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలను మెరుగుపర్చుకోవాలనే లక్ష్యంతో ఇప్పుడు భారత్ బరిలోకి దిగనుంది. చూడాలి ఈ ట్రైనింగ్ సెషన్ ఎలా సాగనుందో?
కివీస్‌తో సిరీస్ ఓటమి- భారత్ WTC ఫైనల్ ఛాన్స్‌లు ఎలా ఉన్నాయంటే?