Sourav Ganguly All Time XI: టీమ్ఇండియా మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాటర్ సౌరభ్ గంగూలీ తన ఆల్ టైమ్ ప్లేయింగ్ ఎలెవన్‌ను (All Time Playing XI) ప్రకటించాడు. గంగూలీ ప్రకటించిన జట్టులో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చోటు దక్కడపోవడం గమనార్హం. దీంతో గంగూలీ ప్రకటించిన జట్టు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కోహ్లీకి చోటు దక్కకపోవడం ఏంటని చాలా మంది అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ దాదా జట్టులో చోటు దక్కించుకున్న ప్లేయర్లు ఎవరంటే?
గంగూలీ ప్లేయింగ్ ఎలెవన్ జట్టు: మాథ్యూ హెడెన్, అలిస్టర్ కుక్, రాహుల్ ద్రవిడ్, సచిన్ తెందూల్కర్, జాక్వెస్ కలిస్, కుమార సంగక్కర (వికెట్ కీపర్), రికీ పాంటింగ్ (కెప్టెన్), గ్లెన్ మెక్ గ్రాత్, డేల్ స్టెయిన్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్.
బ్యాటింగ్ లైనప్
కాగా, గంగూలీ ప్రకటించిన జట్టులో ప్రతి ఒక్కరూ ప్రపంచ క్రికెట్లో తనదైన ముద్ర వేశారు. మరికొందరు లెజెండ్లుగా నిలిచారు. హెడెన్, కుక్, ద్రవిడ్, సచిన్ వంటి దిగ్గజాలను టాప్ ఆర్డర్ బ్యాటర్లుగా గంగూలీ ఎంపిక చేసుకున్నాడు. హెడెన్ బ్రూట్ ఫోర్స్, కుక్ నిలకడ, ద్రవిడ్ డిఫెన్స్, సచిన్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటాడని దాదా అభిప్రాయం. అందుకు దిగ్గజ బ్యాటర్లతో టాప్ ఆర్డర్‌ను నింపేశాడు.
ఆల్ రౌండర్‌గా కల్లిస్- కెప్టెన్‌గా పాంటింగ్
ఆల్ రౌండర్ కోటాలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాక్వెస్ కల్లిస్‌ను ఎంపిక చేసుకున్నాడు గంగూలీ. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లోనూ కల్లిస్ రాణిస్తాడని దాదా అభిప్రాయం. వికెట్ కీపర్‌గా శ్రీలంక దిగ్గజ బ్యాటర్ కుమార్ సంగక్కరను ఎంపిక చేసుకున్నాడు. ఆస్ట్రేలియాకు అనేకసార్లు ప్రపంచకప్‌లను అందించిన రికీ పాంటింగ్‌కు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించాడు. అతడి వ్యూహాలు బాగుంటాయని ఇలా దాదా చేశాడు.
పదునైన బౌలింగ్
ఇక బౌలింగ్ విషయానికొస్తే, పేస్ విభాగంలో మెక్ గ్రాత్, స్టెయిన్‌ను ఎంచుకున్నాడు. స్పిన్నర్లుగా షేన్ వార్న్, మురళీధరన్‌తో మంచి బౌలింగ్ లైనప్‌ను ఎంపిక చేసుకున్నాడు. ఈ నలుగురు ప్రత్యర్థులను హడలెత్తించగలరని గంగూలీ నమ్మకం.
అదే కారణమా?
గంగూలీ తన ఆల్ టైమ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో టీమ్ ఇండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చోటు దక్కడపోవడం గమనార్హం. అయితే గంగూలీ ఎంపిక చేసుకున్న జట్టులో అందరూ పాతతరం క్రికెటర్లే. ప్రస్తుత తరానికి చెందిన క్రికెటర్లు దాదాపుగా లేరు. పాతతరం ప్లేయర్లు వైవిధ్యమైన పరిస్థితుల్లో క్రికెట్ ఆడారు. అప్పట్లో బౌండరీలు కూడా కాస్త పెద్దవిగా ఉండేవి. అందుకే ప్రస్తుత బ్యాటర్లను ఎవర్నీ గంగూలీ ఎంపిక చేయలేదు. విరాట్‌ను కూడా అందుకే సెలక్ట్ చేసుకోలేదేమో!
టీమ్ బ్యాలెన్స్!
గంగూలీ తన టీమ్‌లో కోహ్లీని చేర్చుకుంటే మరొక దిగ్గజ బ్యాటర్‌ను వదులుకోవాల్సి వస్తుంది. దిగ్గజ ప్లేయర్లను వదులుకోవడం ఇష్టం లేక కోహ్లీని ఎంపిక చేయకపోయినట్లు తెలుస్తోంది. కోహ్లీపై వ్యక్తిగత పక్షపాతం వల్ల గంగూలీ ఎంపిక చేయలేదని కొందరు ఆరోపిస్తున్నారు. కానీ, చాలాసార్లు గంగూలీ కోహ్లీపై ప్రసంసలు కురిపించారు.