Indian Grandmaster Gukesh : చాలా మంది క్రీడాకారులకు విజయం ప్రేరణను ఇస్తుంది. కానీ కెనడా వేదికగా జరిగిన ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించిన భారత యువ సంచలనం గుకేశ్‌కు ఓ ఓటమి అతిపెద్ద ప్రేరణగా నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా గుకేశ్ వెల్లడించాడు. ఇరాన్‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్ ఫిరౌజ్జా అలిరెజాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలిపాడు. ఈ టోర్నీలో ఏడో రౌండ్‌లో అలిరెజా చేతిలో గుకేశ్ ఓడిపోయాడు. ఈ ఓటమే తనను ఛాంపియన్‌గా అయ్యేందుకు శక్తిని అందించిందని ఈ గ్రాండ్‌మాస్టర్ తెలిపాడు.
అదే శక్తినిచ్చింది - "నేను ఈ టోర్నీ ప్రారంభం నుంచి సానుకూలంగా ముందుకు సాగాను. కానీ అలీరెజాపై ఏడో రౌండ్ ఓటమి తర్వాత తీవ్రంగా కలత చెందాను. ఇది బాధాకరమైన ఓటమి. ఈ పరాజయమే నాకు శక్తిని, ప్రేరణను అందించింది. ఓడిపోయిన తర్వాత సరైన పనిని కొనసాగిస్తే, సరైన మానసిక స్థితిలో ఉంటే విజయం సాధించగలమని నాకు తెలుసు. నేను దాన్నే నమ్మాను. టోర్నమెంట్ ప్రారంభం నుంచి కేవలం ఆటపైనే దృష్టి పెట్టాను. నన్ను నేను విశ్వసించాను. సరైన ఆలోచనలతో చెస్ ఆడాను. ఈ క్షణాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. టైటిల్ గెలవాలని నాపై ఉన్న ఒత్తిడి నుంచి ఇప్పుడు ఉపశమనం పొందాను." అని గుకేశ్ తెలిపాడు. ప్రపంచ చాంపియన్ టైటిల్ పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని గుకేశ్ తెలిపాడు. విశ్వనాథన్ ఆనంద్ తనను అభినందించడం ఆనందంగా ఉందన్న గుకేశ్ త్వరలోనే తనను కలుస్తానని అన్నాడు. తన తల్లిదండ్రులతో మాట్లాడానని వారు పట్టరాని సంతోషంగా ఉన్నారని గుకేశ్ తెలిపాడు. ట్రైనర్, స్పాన్సర్, స్నేహితులతో మాట్లాడానని పేర్కొన్నాడు.
అందరూ ఆ ఇన్‌స్టిట్యూషన్స్ నుంచే - గుకేశ్ టైటిల్ నెగ్గడం వెనక వెలమ్మాళ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంది. వెలమ్మాళ్ ఇన్‌స్టిట్యూషన్స్ వరుసగా ఐదు సంవత్సరాలు ప్రపంచ స్కూల్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. 2021లో గుకేష్, ప్రజ్ఞానంద ఈ ఇన్‌స్టిట్యూట్‌లో భాగమయ్యారు. 2005 నుంచి ఈ పాఠశాల నుంచి అనేక మంది గ్రాండ్ మాస్టర్లు వచ్చారు. SP సేతురామన్, లియోన్ మెండోంకా, K ప్రియదర్శన్, B అధిబన్, విష్ణు ప్రసన్న, విశాఖ NR, విఘ్నేష్ NR, M కార్తికేయన్, C అరవింద్, కార్తీక్ వెంకటరామన్, వి ప్రణవ్, ఎస్ భరత్, అర్జున్ కళ్యాణ్, పి కార్తికేయన్, ఎన్ శ్రీనాథ్‌లతో మహిళల్లోనూ వర్షిణి, ప్రజ్ఞానానంద సోదరి వైశాలి, రక్షిత, సవిత కూడా గ్రాండ్ మాస్టర్లు అయ్యారు. చెన్నైలో 60 కంటే ఎక్కువ గుర్తింపు పొందిన చెస్ అకాడమీలు నడుస్తున్నాయి.
చరిత్ర సృష్టించిన గుకేశ్ - 17 ఏళ్లకే ప్రతిష్టాత్మక ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ టోర్నీ టైటిల్ దక్కించుకున్న అతిపిన్న వయస్కుడిగా గుకేశ్ రికార్డుల్లోకెక్కాడు. 13వ రౌండ్ నాటికి మొత్తం 8.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో నిలిచిన అతడు.. అమెరికాకు చెందిన హికరు నకమురతో జరిగిన 14వ రౌండ్‌ను డ్రా చేసుకున్నాడు. దీంతో అతడి ఖాతాలో 9 పాయింట్లు చేరాయి. నెపోమ్నియాషి (రష్యా) - ఫాబియానో కరువానా (అమెరికా) మధ్య మ్యాచ్ కూడా డ్రా అయింది. వారిద్దరూ 8.5 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. దీంతో భారత యువ చెస్ ప్లేయర్ గుకేశ్ టైటిల్‌ను సాధించాడు. ఈ విజయంతో ప్రపంచ చాంపియన్ టైటిల్ పోరుకు అర్హత సాధించిన రెండో భారతీయుడిగా, మొదటి టీనేజర్‌గా గుకేశ్ నిలిచాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఫిడే క్యాండిడేట్స్ టైటిల్‌ను నెగ్గిన రెండో భారత ఆటగాడిగా గుకేశ్ నిలిచాడు.
ఇక మిగిలింది అదే - ఇక క్లాసికల్ వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్‌తో తలపడనున్నాడు. అందులోనూ విజయం సాధిస్తే అతి పిన్న వయస్సులో వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. గతంలో మాగ్నస్ కార్ల్‌సన్, కాస్పరోవ్ 22 ఏళ్ల వయసులో ఛాంపియన్లుగా నిలిచారు. అంతకు ముందు ఈ క్లాసికల్ వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్ టోర్నికి భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ క్వాలిఫై అయ్యారు.
ఫిడే క్యాండిడేట్స్ విజేతగా గుకేశ్- భారత గ్రాండ్‌మాస్టర్ ప్రపంచ రికార్డ్ - fide candidates 2024
భారత యువ సంచలనం గుకేశ్‌పై ప్రశంసలు- మోదీ స్పెషల్ ట్వీట్ - Gukesh D Fide Champion