Hockey Hardik Singh : 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యంతో సత్తా చాటిన భారత హాకీ జట్టుకు ఓ నిరాశాజనకమైన (Disappointing) సంఘటనను మిడ్ ఫీల్డర్ హార్దిక్ సింగ్ షేర్ చేసుకున్నాడు. ఒలింపిక్స్‌లో మెడల్ నెగ్గి గత నెల భారత్‌కు తిరిగి వచ్చిన తమకు ఎయిర్ పోర్టులో విచిత్రమైన అనుభవం ఎదురైందని అన్నాడు. అభిమానులు పతకం గెలిచిన తమను పట్టించుకోకుండా సోషల్ మీడియా స్టార్ డాలీ చాయ్‌వాలా (Dolly Chaiwala) తో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించినట్లు పేర్కొన్నాడు.
'నేను స్వయంగా ఎయిర్‌పోర్ట్‌లో నా కళ్లతో చూశాను. అక్కడ నాతో పాటు హర్మన్ ప్రీత్ సింగ్, మన్‌దీప్ సింగ్ ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియా స్టార్ డాలీ చాయ్‌వాలా కూడా అక్కడికి చేరుకున్నాడు. దీంతో అభిమానులంతా అతడితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. మమ్మల్ని అస్సలు గుర్తించలేదు. మేం ఒకరిని ఒకరం చూసుకున్నాం. అది మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. హర్మన్ ప్రీత్ కెరీర్లో 150కి పైగా గోల్స్ చేశాడు. మన్‌దీప్ 100కి పైగా ఫీల్డ్ గోల్స్ సాధించాడు. డాలీ చాయ్‌వాలా స్పెషల్ టీ (Special Tea)తో సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. బిల్‌గేట్స్‌కి కూడా టీ అందించాడు. అది గొప్ప విషయమే, కానీ ఒలింపిక్స్‌లో రెండు సార్లు మెడల్స్ సాధించినప్పటికీ భారత హాకీ స్టార్లకు తగిన గుర్తింపు దక్కడం లేదు. ఒక అథ్లెట్‌కు గొప్ప పేరు, డబ్బు ముఖ్యమే. కానీ, ఫ్యాన్స్ మమ్మల్ని చూస్తున్నప్పుడు, అభినందిస్తున్నప్పుడూ అంతకంటే ఆనందం మరొకటి ఉండదు' అని హార్దిక్ అన్నాడు.
కాగా, రీసెంట్గా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ హాకీ జట్టు ఛాంపియన్‌గా నిలించింది. చైనా వేదికగా జరిగిన ఈ టోర్నీలో అజేయంగా ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్ఇండియా తుదిపోరులోనూ అదరగొట్టి ఐదోసారి టైటిల్ విజేతగా నిలిచింది. గతంలో 2011, 2016, 2018, 2023 ఎడిషన్ల్లో భారత హాకీ జట్టు ఆసియా ఛాంపియన్స్‌గా నిలిచింది. ఇక అంతకుముందు పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో కాంస్యంతో సత్తా చాటింది.
పొట్టకూటికి పతాకాలు అమ్మి - ఆసియాకప్ అందించి- యువ కెరటం జుగ్‌రాజ్ సింగ్ కథ ఇది! - Jugraj Singh
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్- ఐదోసారి ట్రోఫీ కైవసం - India Wins Asian Champions Trophy