IAN BOTHAM FALLS INTO CROCODILES RIVER : ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ బోథమ్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బోటుపై ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. అతడిని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మెర్వ్ హ్యూస్ కాపాడాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?
త్రుటిలో తప్పిన ప్రమాదం - ఇయాన్ బోథమ్ ఆస్ట్రేలియాలోని నార్తర్న్ టెరిటరీలో ఆసీస్ మాజీ ఆటగాడు మెర్వ్ హ్యూస్‌తో కలిసి నాలుగు రోజుల ఫిషింగ్ ట్రిప్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో పడవ ఎక్కే సమయంలో బోథమ్ అదుపుతప్పి మోయల్ నదిలో పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన మెర్వ్ హ్యూస్ బోథమ్ సురక్షితంగా పడవలోకి చేర్చాడు. లేదంటే బోథమ్ ప్రాణాలకు ప్రమాదం ఉండేది. ఎందుకంటే మోయల్ నదిలో మొసళ్లు, బుల్ షార్కులు ఎక్కువగా ఉంటాయట. నదిలో ఎక్కువసేపు బోథమ్ ఉండి ఉంటే వాటి నుంచి ప్రమాదం ఎదురయ్యేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో బోథన్‌కు వీపు పక్క భాగం, మరికొన్ని చోట్ల గాయాలైనట్లు తెలుస్తోంది.
'క్షేమంగా ఉన్నా' - ఈ ప్రమాదంపై బోథమ్ స్పందించాడు. తనను రక్షించిన హ్యూస్, మరికొందరిపై ప్రశంసలు కురిపించాడు. తాను నీటిలోకి వెళ్లిన దాని కన్నా వేగంగా బయటకొచ్చానని చెప్పుకొచ్చాడు. నీటిలో ఏమి ఉన్నాయో కూడా ఆలోచించడానికి తనకు సమయం లేదని పేర్కొన్నాడు. తాను ఇప్పుడు క్షేమంగానే ఉన్నానని చెప్పుకొచ్చాడు.
వేర్వేరు దేశాలకు ఆడినా, బెస్ట్ ఫ్రైండ్సే
బోథమ్, హ్యూస్ వేర్వేరు దేశాలకు ఆడినప్పటికీ మంచి మిత్రులు. బోథమ్‌కు ఫిషింగ్ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో ఫిషింగ్‌కు హ్యూస్‌తో కలిసి వెళ్లాడు. ఇకపోతే బోథమ్, హ్యూస్ యాషెస్ సిరీస్‌లో వేర్వేరు దేశాలకు ఆడారు. 1980 యాషెస్ సిరీస్‌లో హ్యూస్ ఓవర్లో బోథమ్ ఏకంగా 22 పరుగులు బాదాడు. దీంతో యాషెస్ సిరీస్‌లలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బోథమ్ రికార్డుకెక్కాడు.
ఇంగ్లాండ్ దిగ్గజ ఆల్ రౌండర్ - అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు ఇంగ్లాండ్ క్రికెటర్ ఇయాన్ బోథమ్. తన జట్టుకు బ్యాట్‌తోనూ, బంతితోనూ మరపురాని ఎన్నో విజయాలను అందించాడు. మ్యాచ్ విన్నర్‌గా పేరున్న ఇతడు టెస్టులు, వన్డేల్లోనూ సత్తా చాటాడు. 15 ఏళ్ల క్రికెట్ కెరీర్లో 102 టెస్టులు ఆడి 383 వికెట్లు తీశాడు. 33.54 సగటుతో 5,200 పరుగులు చేశాడు. అలాగే 116 వన్డేల్లో 2,113 రన్స్ బాదాడు. అలాగే 143 వికెట్లు పడగొట్టాడు.
'అది చాలా ముఖ్యం - రోహిత్ శర్మ నుంచి ఎంతో నేర్చుకున్నా'
చెఫ్‌గా మారిన సూర్య కుమార్ - రెండు సూపర్ క్రికెట్ రెసిపీలతో!