Engineer Cricketers: ఏ దేశానికైనా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ప్రాతినిధ్యం వహించడం అంత ఈజీ కాదు. స్కూల్ ఏజ్ నుంచి శ్రమించాలి, బెస్ట్ ట్రైనింగ్ తీసుకోవాలి. అలాంటప్పుడు స్టడీస్‌కి ఎక్కువ సమయం కేటాయించలేరు. అందరిలోనూ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా తక్కువగా ఉంటుందనే భావన ఉంటుంది. కానీ చాలా మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడారని, ప్రస్తుతం ఆడుతున్నారని మీకు తెలుసా?
2024 వరల్డ్‌కప్‌లో జూన్ 6న యూఎస్‌ఏ చేతిలో పాకిస్థాన్‌కి అనూహ్య ఓటమి ఎదురైంది. సూపర్ ఓవర్‌కి దారి తీసిన మ్యాచ్‌లో యూఎస్‌ఏ అద్భుతమైన విజయం అందుకుంది. సూపర్ ఓవర్ బౌలింగ్ చేసిన యూఎస్‌ఏ ప్లేయర్, భారత సంతతికి చెందిన సౌరభ్ నేత్రావల్కర్. పాక్ 6బంతుల్లో 19 పరుగులు చేయాల్సి ఉండగా, కేవలం 13 రన్స్ ఇచ్చి యూఎస్‌ఏకి చారిత్రక విజయం అందించాడు. ఈ లెప్ట్ ఆర్మ్ పేసర్, ఒరాకిల్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. క్రికెట్ మీద ఆసక్తితో పార్ట్‌టైమ్ క్రికెట్ ఆడతున్నాడు. అతనొక్కడే కాదు, ఇలాంటి వారు ప్రస్తుత క్రికెట్‌లో ఇంకా ఉన్నారు.
సౌరభ్ నేత్రవల్కర్: సౌరభ్ నేత్రవల్కర్ ఒరాకిల్‌లో టెక్నికల్ స్టాఫ్‌లో ప్రధాన సభ్యుడు. అతను U-19 ప్రపంచ కప్ 2010లో భారతదేశం తరఫున ఆడాడు. తర్వాత డొమెస్టిక్ క్రికెట్‌లో ముంబయికి ప్రాతినిధ్యం వహించాడు. కానీ పెద్దగా అవకాశాలు లేకపోవడంతో USAకి మారాడు. చదువు పూర్తయిన తర్వాత, నేత్రవల్కర్ ఒరాకిల్‌లో టెక్నికల్ స్టాఫ్‌లో సభ్యునిగా చేరాడు. ఒరాకిల్ సంస్థలో 8 సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. యునైటెడ్ స్టేట్స్ తరఫున ప్రొఫెషనల్ క్రికెట్ కూడా ఆడుతున్నాడు.
రవిచంద్రన్ అశ్విన్: టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇంజనీరే. చెన్నైలోని SSN కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీని పొందాడు. నిజానికి, అశ్విన్ క్రికెట్‌లోకి పూర్తిగా రాకముందు, కొంతకాలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కూడా పనిచేశాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన టెస్ట్ క్రికెటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు.
సర్ఫరాజ్ అహ్మద్: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, 2017లో పాక్‌కి ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. సర్ఫరాజ్ 2019 వన్డే ప్రపంచకప్‌లో పాక్‌కి కెప్టెన్సీ చేశాడు. అతడు ప్రస్తుతం పాక్ జాతీయ జట్టులో భాగం కానప్పటికీ, క్రమం తప్పకుండా PSLలో ఆడుతాడు. అతను కరాచీలోని దావూద్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశాడు.
అనిల్ కుంబ్లే: ఈ లిస్ట్‌లో భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఉన్నాడు. కుంబ్లే B.E పూర్తి చేశాడు. బెంగళూరులోని రాష్ట్రీయ విద్యాలయ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. కుంబ్లే భారత్ తరఫున 132 టెస్టులు, 271 వన్డేలు ఆడాడు. ఇప్పటి వరకు, ఒకే టెస్టు ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన ఏకైక భారత బౌలర్ అతడే.
జావగల్ శ్రీనాథ్: టీమ్‌ఇండియా మాజీ లెజెండరీ బౌలర్ జవగల్ శ్రీనాథ్ కూడా వృత్తిరిత్యా ఇంజినీర్. అతడు ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీలో డిగ్రీ అందుకున్నాడు. మైసూరులోని శ్రీ జయ చామరాజేంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో B.E పూర్తి చేశాడు. శ్రీనాథ్ భారత్ తరఫున 67 టెస్టులు, 229 వన్డేలు ఆడాడు.
డేంజరస్‌గా మారుతున్న అమెరికన్ టీమ్ - మనోళ్లు జాగ్రత్తగా ఆడాల్సిందే! - T20 WorldCup 2024