Duleep Trophy 2024 : 2024-25 దులీప్ ట్రోఫీ జట్లను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మొత్తం నాలుగు స్క్వాడ్‌లను ప్రకటించింది. డొమెస్టిక్ క్రికెట్లో రెడ్-బాల్ క్రికెట్‌కు నాంది పలికే దులీప్ ట్రోఫీలో చాలా మంది స్టార్ ప్లేయర్లు పాల్గొంటున్నారు. అయితే దీన్నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లికి విశ్రాంతి ఇచ్చారు. ఇంతకీ ఈ ముగ్గురు సీనియర్ ప్లేయర్లు చివరిగా డొమెస్టిక్ క్రికట్ ఎప్పుడు ఆడారో తెలుసా?
రోహిత్ శర్మ
భారత కెప్టెన్ రోహిత్ శర్మ చివరి దేశవాళీ క్రికెట్ మ్యాచ్ దాదాపు ఎనిమిదేళ్ల క్రితం 2016 సెప్టెంబర్‌లో ఆడాడు. చివరి దేశవాళీ మ్యాచ్ దులీప్ ట్రోఫీలో ఇండియా బ్లూ తరఫున ఆడాడు. ఆడిన రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పెద్దగా రాణించలేదు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. మొత్తంగా 32 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
విరాట్ కోహ్లీ
కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడి చాలా కాలమైంది. చివరిగా 2011లో ఉత్తరప్రదేశ్‌తో ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. మ్యాచ్‌లో 14, 43 స్కోర్‌లతో 57 పరుగులు మాత్రమే చేశాడు.
జస్ప్రీత్ బుమ్రా:
2018లో బుమ్రా తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి వరుసగా జాతీయ జట్టులో భాగంగా మారాడు. అతని చివరి డొమెస్టిక్ క్రికెట్ మ్యాచ్ 2016/17 రంజీ ట్రోఫీ సీజన్‌లో ఆడాడు. 2017 జనవరిలో జార్ఖండ్‌పై గుజరాత్ తరఫున బరిలో దిగాడు. అతను మ్యాచ్‌లో 6 వికెట్లు తీసి కేవలం 29 పరుగులు ఇచ్చాడు.
కొత్త ఫార్మాట్‌లో డొమెస్టిక్ టోర్నీ
1961లో మొదలైన దులీప్ ట్రోఫీ ఇప్పటివరకూ ఆరు టీమ్‌లతో జోనల్ ఫార్మాట్‌లో జరిగేది. అయితే 2024 నుంచి ఈ జోనల్ ఫార్మాట్‌కు స్వస్తి పలికారు. దీంతో ఈ సారి నాలుగు టీమ్‌లతోనే దులీప్ ట్రోఫీ జరగనుంది. అంతేకాకుండా టోర్నమెంట్‌ను ఎలాంటి నాకౌట్ మ్యాచ్‌లు లేకుండానే రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో నిర్వహించనుంది.
ప్రతి జట్టు మిగిలిన అన్ని జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్‌లు ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు విజేతగా నిలుస్తుంది. ఒక్కో మ్యాచ్ నాలుగు రోజులపాటు జరగనుంది. సెప్టెంబరు 19 (చెన్నై), 27 (కాన్పూర్)న బంగ్లాదేశ్‌తో ప్రారంభమయ్యే రెండు టెస్టులకు దులీప్ ట్రోఫీలో ప్రదర్శన ఆధారంగానే జట్టును ఎంపిక చేస్తామని బీసీసీఐ ప్రకటించింది.
దులీప్ ట్రోఫీ షెడ్యూల్
సెప్టెంబరు 5 - టీమ్ ఎ Vs టీమ్ బి (చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు)
సెప్టెంబరు 5 - టీమ్ సి Vs టీమ్ డి (రూరల్ డెవలప్‌మెంట్ స్టేడియం 'ఎ', అనంతపురం)
సెప్టెంబరు 12 - టీమ్ ఎ Vs టీమ్ డి (రూరల్ డెవలప్‌మెంట్ స్టేడియం 'ఎ', అనంతపురం)
సెప్టెంబరు 12 - టీమ్ బి Vs టీమ్ సి (రూరల్ డెవలప్‌మెంట్ స్టేడియం 'బి', అనంతపురం)
సెప్టెంబరు 19 - టీమ్ బి Vs టీమ్ డి (రూరల్ డెవలప్‌మెంట్ స్టేడియం 'బి', అనంతపురం)
సెప్టెంబరు 19 - టీమ్ ఎ Vs టీమ్ సి (రూరల్ డెవలప్‌మెంట్ స్టేడియం 'ఎ', అనంతపురం)
దులీప్ ట్రోఫీ స్క్వాడ్స్ ఔట్ - రోహిత్, కోహ్లీ నో ఇంట్రెస్ట్! - Duleep Trophy 2024