Dhoni Ticket Collector Appointment Letter : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెపనక్కర్లేదు. క్రికెట్ అభిమానుల్లో ఆయనంటే తెలియని వారు ఉండరు. వరల్డ్ వైడ్‌గా ఉన్న అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో మహీ ఒకరు. ఆయన కెప్టెన్సీలోనే మూడు ఫార్మాట్లలో (టీ20 ప్రపంచకప్ 2007, ప్రపంచకప్ 2011, ఛాంపియన్స్ ట్రోఫీ 2013) టీమ్ ఇండియా ఛాంపియన్‌గా నిలిచింది.
ఆయన్ను అందరూ ముద్దుగా కెప్టెన్ కూల్ అని పిలుచుకుంటారు. అయితే మహీ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. మహీ క్రికెట్ కెరీర్‌ను కాస్త పక్కనపెడితే ఆయన సక్సెస్ఫుల్ క్రికెటర్‌గా మారడానికి ముందు ఏం చేసేవారో చాలా మందికి తెలిసిన విషయమే. రైల్వేస్‌లో టికెట్ కలెక్టర్‌గా పని చేసేవారు.
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మహీ తొలి ఉద్యోగ నియామక లేఖ చక్కర్లు కొడుతోంది. దాన్ని చూసిన క్రికెట్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఇకపోతే కొంత కాలం పాటు టికెట్ కలెక్టర్‌గా పని చేసిన మహీ ఆ తర్వాత తన కలను నెరవేర్చుకునేందుకు ఉద్యోగం వదిలి బ్యాట్ పట్టారు. అనంతరం ఎన్నో రికార్డులు సాధించి సక్సెస్‌ఫుల్‌గా కెప్టెన్‌గా ఎదిగారు. ప్రపంచంలోనే మేటి క్రికెటర్స్‌లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు.
కాగా, రాంచీలో జన్మించిన మహీ 2004లో బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశారు. కానీ దురదృష్టవశాత్తు గోల్డెన్ డక్‌తో వెనుదిరిగారు. అయినా ధోనీ పట్టు వదలకుండా శ్రమిస్తూ కెరీర్లో ముందుకెళ్లారు. విశాఖపట్నంలో పాకిస్థాన్‌తో జరిగిన తన ఐదో వన్డేలో 148 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి తన తొలి ఇంటర్నేషనల్ సెంచరీని బాదారు. ఇక అప్పటినుంచి మహీ కెరీర్ దూసుకెళ్లింది. టీమ్ ఇండియా కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించారు. అతడి సారథ్యంలో తొలిసారి 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడంది టీమ్ ఇండియా.
ఇప్పుడాయన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ ఐపీఎల్‌లో కొనసాగుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. అతడి సారథ్యంలో సీఎస్‌కే ఇప్పటివరకు ఐదో సార్లు ట్రోఫీని కైవసం చేసుకుంది.