De Villiers On Pant Comeback: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ దాదాపు 14 నెలల తర్వాత మైదానంలోకి దిగనున్నాడు. అతడు 2024 ఐపీఎల్‌తో మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. 2022లో జరిగిన యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకున్న పంత్ పూర్తి స్థాయిలో రానున్న ఐపీఎల్లో బరిలో దిగనున్నట్లు దిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే తెలిపింది.
దీంతో అతడి కమ్‌బ్యాక్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సౌతాఫ్రితా మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ కూడా పంత్ రాకకై ఎదురుచూస్తున్నట్లు రీసెంట్గా తన యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నాడు. పంత్‌ను మళ్లీ గ్రౌండ్లో చూడనుండడం చాలా ఆనందంగా ఉందన్నాడు. అతడు కూడా నెం. 17 జెర్సీనే ధరిస్తాడని డివిలియర్స్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు.
'ఐపీఎల్లో దిల్లీ బాయ్ పెర్ఫార్మెన్స్ చూసేందుకు యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది. అందులో నేనూ ఒకడిని. పంత్ రీ ఎంట్రీ ఇవ్వనుండడం సంతోషంగా ఉంది. నా జెర్సీ నెంబర్ 17. పంత్ జెర్సీ నెంబర్ కూడా 17. ఇద్దరం ఒకే నెంబర్ జెర్సీ ధరిస్తాం. ఈ విషయంలో మా ఇద్దరి మధ్య అనుబంధం ఉంది. సాధారణంగా పంత్ బ్యాటింగ్ చూసేందుకు నేను ఇష్టపడతా. ఇప్పటిదాకా అతడు ఐపీఎల్లో ఒకే సెంచరీ చేశాడు. ఈ సీజన్ (2024)లో సెంచరీల సంఖ్య పెరగవచ్చు. నాలుగు శతకాలైనా ఆశ్చర్యపోనవసరం లేదు' అని డివిలియర్స్ అన్నాడు.
ఇక మరో యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ గురించి కూడా డివిలియర్స్ మాట్లాడాడు. 'ఈ సీజన్లో జైస్వాల్ బ్యాటింగ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా. టెస్టు సిరీస్‌ల్లో అతడి టాలెంట్ చూశాం. ఇప్పుడు టీ20ల వంతు. ఈ ఫార్మాట్లోనూ జైస్వాల్ అదరగొడతాడన్న నమ్మకం ఉంది. ఈ సీజన్లో అతడు 500 పై చిలుకు పరుగులు సాధిస్తాడని అనుకుంటున్నా. 600 పరుగుల మార్క్ కూడా అందుకోవచ్చు' అని అన్నాడు.