Davis Cup India Pakisthan : పాకిస్థాన్ గడ్డపై సుదీర్ఘ విరామం దాదాపు 60ఏళ్ల తర్వాత డేవిస్ కప్ ఆడుతున్న భారత్ శుభారంభం చేసింది. ఇస్లామాబాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా మొదలైన ప్రపంచ గ్రూప్-1 ప్లేఆఫ్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్, శ్రీరామ్ బాలాజీ అదరగొట్టారు. తొలి రెండు సింగిల్స్‌ను గెలిచారు. దీంతో భారత్ 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్ 6-7 (3-7), 7-6 (7-4), 6-0తో అసిమ్ ఖురేషిను ఓడించాడు. గ్రాస్ కోర్టుపై జరుగుతున్న ఈ పోరులో తొలి సింగిల్స్‌లో ఖురేషి - రామ్‌కుమార్‌కు గట్టి పోటీనే ఇచ్చాడు. తొలి సెట్ ఆరంభంలోనే రామ్‌కుమార్ సర్వీస్ బ్రేక్ చేసి 3-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ ఆ తర్వాత రామ్‌కుమార్ మెరుపు సర్వీసులు, బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో ఖురేషి సర్వీస్ బ్రేక్ చేసి స్కోరు సమం చేశాడు. ఇద్దరూ పోటాపోటీగా ఆడడంతో సెట్ టైబ్రేకర్‌కు మళ్లింది. టైబ్రేకర్‌లో రామ్‌కుమార్ తడబడడం వల్ల ఖురేషి సెట్ గెలిచి ఆధిక్యంలోకి వెళ్లాడు.
రెండో సెట్ కూడా హోరాహోరీగా సాగింది. రామ్‌కుమార్ మెరుపు విన్నర్లు బాదితే, ఖురేషి పదునైన బ్యాక్‌హ్యాండ్ షాట్లను ఆడాడు. ఈ సెట్ కూడా టైబ్రేకర్‌కు మళ్లింది. కానీ ఇందులో రామ్ కుమార్ 4-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అంతే కాదు ఈ రెండో సెట్ గెలిచి మ్యాచ్‌ను మూడో సెట్ వరకు తీసుకెళ్లాడు.
ఇక ఈ నిర్ణయాత్మక సెట్లో రామ్ కుమార్ ధాటికి ప్రత్యర్థి ఖురేషి నిలబడలేకపోయాడు. ఏస్‌లతో చెలరేగిన రామ్‌కుమార్ ఒక్క గేమ్ కూడా ఖురేషికి ఇవ్వలేదు. 6-0తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను దక్కించుకున్నాడు.
రెండో సింగిల్స్‌లో శ్రీరామ్ 7-5, 6-3తో అకీల్ఖాన్పై విజయం సాధించాడు. ఈ పోరులోని రెండు సెట్లలో ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసిన శ్రీరామ్ మెరుపు సర్వీసులు, డ్రాప్‌షాట్లతో తేలిగ్గానే మ్యాచ్‌ను దక్కించుకున్నాడు.
ఇక నేడు(ఫిబ్రవరి 4) ఆదివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో సాకేత్ మైనేని-యుకి బాంబ్రి ద్వయం ముజామిల్-బర్కతుల్లా జోడీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్రపంచ గ్రూప్-1 దశకు భారత్ అర్హత సాధించినట్టే. ఓడితే మాత్రం రివర్స్ సింగిల్స్ ఆడాల్సిన అవసరం ఉంటుంది.
రెండో సారి తల్లిదండ్రులు కానున్న విరుష్క జంట - ఏబీడీ క్లారిటీ
'యశస్వి క్రికెట్ వెర్షన్ ఆఫ్ మనోజ్ శర్మ'- జైశ్వాల్ జర్నీ '12th ఫెయిల్' సినిమాలాంటిదే!