Danielle Wyatt Joins RCB WPL : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి పదేళ్ల క్రితం ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమెను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ జట్టులోకి తీసుకుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీ మహిళల జట్టులో ఈమెకు చోటు దక్కింది.
అంతకుముందు డేనియల్ వ్యాట్ డబ్ల్యూపీఎల్‌లో యూపీ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహించింది. అయితే ఇప్పుడు ట్రేడింగ్‌లో ఆర్సీబీ ఆమెను దక్కించుకుంది. ఇప్పటి వరకు యూపీ వారియర్స్ చెల్లించిన రూ.30 లక్షలనే, ఆర్సీబీ కూడా ఆమెకు చెల్లించనుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.
ఇదే విషయాన్ని డబ్ల్యూపీఎల్ కూడా తెలిపింది. "వాస్తవానికి వేలంలో యూపీ వారియర్స్ ఆమెను రూ.30 లక్షలకు దక్కించుకుంది. అయితే వ్యాట్ ఆర్సీబీకి బదిలీ కానుంది. ఆర్సీబీ జట్టుకు వ్యాట్ తన అనుభవాన్ని ఇవ్వనుంది. ఇప్పటికే ఆమె ఇంగ్లాండ్ తరఫున 164 అంతర్జాతీయ టీ20లు ఆడింది. టీ20 ఫార్మాట్లో ఏ ఇంగ్లీష్ ప్లేయర్ కూడా ఇన్ని అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడలేదు. " అని డబ్ల్యూపీఎల్ రాసుకొచ్చింది.
కాగా, ఇంగ్లాండ్ మహిళల జట్టులో స్టార్ ప్లేయర్ డేనియల్ వ్యాట్. ఆమె ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని. ఆమెకు ఆర్సీబీ జట్టు అంటే కూడా ఇష్టం. అలా ఆమె పదేళ్ల క్రితం అనగా 2014లో విరాట్ కోహ్లీకి ప్రపోజ్ చేసింది. 'కోహ్లీ నన్ను పెళ్లి చేసుకోవా' అని అప్పట్లో ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది. అయితే ఇప్పుడు వ్యాట్ తాజాగా ఆర్సీబీకి బదిలీ కానుండడంతో 10 ఏళ్ల క్రితం ఆమె పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట మరోసారి వైరల్‌గా మారింది.
డేనియల్ వ్యాట్ ఇప్పటి వరకు ఇంగ్లాండ్ తరపున రెండు టెస్టులు, 112 వన్డేలు, 167 టీ20లు ఆడింది. ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలదు. ఇప్పుడు డబ్ల్యూపీఎల్ ఆర్సీబీలో ఆమె చేరడంతో ఆ జట్టు మరింత బలంగా మారినట్టైంది.
Kholi marry me!!!
— Danielle Wyatt-Hodge (@Danni_Wyatt) April 4, 2014
ఆఖరి సమరంలో పరువు కాపాడుకునేందుకు - 35 మంది నెట్ బౌలర్లతో భారత్ ప్రాక్టీస్!
బెన్‌స్టోక్స్ ఇంట్లో విలువైన వస్తువుల చోరీ - సాయం కోరిన ఇంగ్లాండ్ కెప్టెన్