Cricketer Died While Playing : మహారాష్ట్రలోని పుణె వేదికగా జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఓ క్రికెటర్ మైదానంలోనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. అప్పటివరకూ తమతో ఆడుతున్న ఆటగాడు నిర్జీవంగా మారడం వల్ల తోటి క్రికెటర్లు విషాదంలో మునిగిపోయారు.
అసలేం జరిగిందంటే? - 35 ఏళ్ల ఇమ్రాన్ పటేల్ ఓపెనర్‌గా మైదానంలోకి దిగాడు. కాసేపటికే ఎడమవైపు ఛాతీలోనొప్పిగా ఉందంటూ తోటి ప్లేయర్స్ కు తెలిపాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్లతో చర్చించిన అనంతరం అతడు డగౌట్‌కు వెళ్లేందుకు రెడీ అయ్యాడు. కొద్దిదూరం వెళ్లగానే మైదానంలో హఠాత్తుగా కుప్పకూలాడు. దీంతో ఒక్కసారిగా ఆటగాళ్లు, ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఇమ్రాన్ పటేల్ ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుండటం వల్ల మైదానంలో ప్లేయర్ కుప్పకూలిన వీడియోలు బయటకు వచ్చాయి.
ఆవేదన వ్యక్తం చేసిన సహచరులు
తోటి క్రికెటర్ మైదానంలోనే ప్రాణాలు వదలడంపై సహచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. శారీరకంగా ఫిట్‌గా ఉండే ఇమ్రాన్‌కు ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదని వాపోయారు. ఆల్‌రౌండర్ అయిన ఇమ్రాన్ పటేల్ ప్రతి మ్యాచ్‌లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటాడని తెలిపారు. ఇప్పుడు మైదానంలో గుండె పోటుతో మృతిచెందడం షాక్‌కు గురి చేసిందని వాపోయారు. వాస్తవానికి ఇమ్రాన్ మెడికల్ కండీషన్ ఎప్పుడూ బాగానే ఉందని తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇమ్రాన్ గుండె సమస్యలతో ఇబ్బంది పడలేదని పేర్కొన్నారు. ఆటపై ప్రేమ కలిగిన ఇలాంటి క్రికెటర్‌ను కోల్పోవడం బాధగా ఉందని అన్నారు.
కొడుకు వయసు కేవలం 4నెలలే
కాగా, ఇమ్రాన్ పటేల్ మృతి విషయం తెలిసి అతడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఇమ్రాన్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కొడుకు వయసు కేవలం నాలుగు నెలలు మాత్రమే. క్రికెట్ ఆడటంతోపాటు రియల్ ఎస్టేట్, జ్యూస్ షాప్ కూడా నిర్వహిస్తున్నాడు ఇమ్రాన్.
సెప్టెంబరులో ఓ క్రికెటర్ మృతి
పుణెలోనే ఈ ఏడాది సెప్టెంబర్‌లో హబీబ్ షేక్ అనే క్రికెటర్ కూడా క్రికెట్ ఆడుతూ ప్రాణాలు విడిచాడు. అయితే, అతడికి అప్పటికే డయాబెటిక్ సమస్య ఉండేది. కానీ, ఇమ్రాన్ పటేల్‌కు మాత్రం అనారోగ్య సమస్యలేమీ లేకపోయినా అకస్మాత్తుగా ప్రాణాలు వదిలాడు.