Champions Trophy 2025 India tour of Pakisthan : వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్‌ఇండియా పాల్గొంటుందా? లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీ ప్రతిపాదిత షెడ్యూల్‌ను కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి సమర్పించింది. భద్రతా, రవాణాపరమైన కారణాల దృష్ట్యా భారత జట్టు లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆడేలా షెడ్యూల్ ఏర్పాటు చేశారు. కానీ పాకిస్థాన్‌కు వెళ్లి ఆడేందుకు టీమ్‌ఇండియా సుముఖంగా లేదు.
అయితే తాజాగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియాను పాకిస్థాన్‌కు పంపేలా బీసీసీఐని ఒప్పించే బాధ్యతను పీసీబీ ఐసీసీకి అప్పగించిందని తెలిసింది. రీసెంట్గా కొలంబోలో జరిగిన ఐసీసీ వార్షిక మీటింగ్‌లో ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన బడ్జెట్, షెడ్యూల్‌ను ఐసీసీకి సమర్పించినట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి.
"ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ఫైనలైజ్ చేయడం ఇప్పుడు ఐసీసీ పరిధిలోని అంశం. డ్రాఫ్ట్ షెడ్యూల్‌లో టీమ్‌ఇండియా ఆడే అన్ని మ్యాచ్‌లను లాహోర్‌లోనే ఆడేలా రూపొందించారు. పన్ను విధివిధానాలు, వేదికల ఎంపిక, భారత్ జట్టుకు ఆతిథ్యం ఇవ్వడానికి పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి అనుమతికి సంబంధించిన వివరాలను పీసీబీ ఐసీసీకి సమర్పించింది అని" పీసీబీ వర్గాలు తెలిపాయి.
ఎక్స్ట్రా ఫండ్స్ - అయితే భారత్ తాను ఆడే మ్యాచ్‌లను గతంలో లాగా ఆసియా కప్ నిర్వహించినట్లు వేరే దేశంలో నిర్వహించాలని బీసీసీఐ కోరుతున్నట్లు సమాచారం. టీమ్‌ఇండియా కోసం మ్యాచ్‌లను దుబాయ్ లేదా శ్రీలంకల్లో నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ వర్గాలు అడిగినట్లు తెలిసింది. అయితే దీనిపై ఐసీసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. లేదంటే భారత ప్రభుత్వం నుంచి పర్మిషన్ వస్తేనే టీమ్‌ఇండియా పాకిస్థాన్‌కు వెళ్తుంది.
అయితే ఒకవేళ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే వేరే దేశంలో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడితే అందుకే ఇబ్బంది లేకుండా ఉండేలా ఐసీసీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిసింది. టీమ్‌ఇండియా ఆడే మ్యాచ్‌లు మరో దేశంలో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడితే అందుకు అవసరమైన ఎక్స్ట్రా నిధులను టోర్నీ బడ్జెట్‌లో కేటాయించిందట.
పారిస్ ఒలింపిక్స్‌కు ఏఐ నిఘా - ప్రైవసీపై వెల్లువెత్తుతున్న ఆందోళనలు - Paris Olympics 2024
టీ20 ప్రపంచకప్ నిర్వహణలో ఆర్థిక మోసాలు! - ఐసీసీ కీలక నిర్ణయం - ICC T20 Worldcup 2024