IND VS AUS Gabba Test Rain : బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు డిసెంబర్ 14న గబ్బా వేదికగా మొదలు కానుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని భారత జట్టు భావిస్తుంటే, ఆస్ట్రేలియా జట్టు తమ జోరును కొనసాగించాలని పట్టుదలతో ఉంది. ఎందుకంటే ఈ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే జరిగిన తొలి టెస్ట్‌లో టీమ్ ఇండియా విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో కంగారులు గెలిచారు.
పైగా ఈ గబ్బా వేదికపై 1988 నుంచి 2021 వరకు ఆసీస్ జట్టుకు అసలు ఓటమనేదే తెలీదు. కానీ 2020-21లో మాత్రం వారి విజయాల రికార్డును టీమ్ఇండియా బ్రేక్ చేసింది. దీంతో ఇప్పుడు మూడు టెస్ట్‌లో గెలువాలని ఇరు జట్లు గట్టి పట్టుదలతో ఉన్నాయి.
అయితే ఇప్పుడు ఈ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే గత రెండు రోజుల నుంచి బ్రిస్బేన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో మూడో టెస్టు మ్యాచ్ జరగడం కష్టమని పలు రిపోర్ట్‌లు చెబుతున్నాయి.
భారత కాలమానం ప్రకారం ఉదయం 5.50 గంటల నుంచి మ్యాచ్ మొదలు అవుతుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ జరగనున్న ఐదు రోజుల్లోనూ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది. మొదటి రోజు 88 శాతం వర్షం పడే ఛాన్స్ ఉందని, అలానే రెండు, నాలుగు రోజుల్లో 40 శాతం కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక 3, 5 రోజుల్లో 20 శాతం కురవచ్చని చెబుతున్నారు.
దీంతో భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్ భారత్‌కు ఎంతో కీలకం. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ గబ్బా టెస్టులో టీమ్ ఇండియా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పిచ్ ఎలా ఉందంటే? - తాజాగా జరగబోయే మూడో టెస్టులోనూ టీమ్‌ఇండియాకు పేస్ పరీక్ష తప్పదు. క్రిస్మస్ తర్వాత కాకుండా వేసవి ఆరంభం (ఆస్ట్రేలియాలో) మ్యాచ్ జరుగుతున్నందున మ్యాచ్ వేదిక అయిన గబ్బాలో పిచ్ ఎప్పటిలాగే పేస్, బౌన్స్‌కు సహకరించనుంది. గత సారి పంత్ సూపర్ ఇన్నింగ్స్‌తో గబ్బాలో భారత్ అద్భుత విజయాన్నందుకుంది. అయితే ఆ మ్యాచ్ (నాలుగో టెస్టు) జనవరిలో జరిగింది. 1988 తర్వాత గబ్బాలో ఓడిపోవడం ఆస్ట్రేలియాకు అదే తొలిసారి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు గబ్బా మ్యాచ్‌ను ఆస్ట్రేలియా త్వరగా నిర్వహిస్తోంది.
కాగా తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించగా, రెండో మ్యాచులో ఆతిథ్య జట్టు ఆసీస్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. దీంతో ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది.
కుంబ్లే, హర్భజన్ కన్నా అతడి బౌలింగ్‌లోనే కీపింగ్ చేయడం కష్టం! : ధోనీ