Teamindia HeadCoach : టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వచ్చే నెలలో అమెరికా వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్ ఈవెంట్‌తో హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తుంది. ఈ మేరకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ 2024 మే 27లోగా దరఖాస్తులను సమర్పించాలని తెలిపింది. అప్లికేషన్లను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్లను మాత్రమే పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తామని అందులో పేర్కొంది.
అలా ఎంపిక అయిన కొత్త కోచ్ జులై 1 నుంచి అంటే టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ ముగిసిన వెంటనే బాధ్యతలు స్వీకరిస్తారు. 2027 డిసెంబర్ 31 వరకూ పదవిలో కొనసాగుతారు. హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేయడానికి బోర్డు నిర్దేశించిన అర్హతలు, నైపుణ్యాల ప్రకారం 60 ఏళ్ల కంటే తక్కువ వయస్సుతో పాటు కనీసం 30 టెస్టులు, 50 వన్డేలు ఆడి ఉండాలని, పైగా కనీసం రెండేళ్లు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించి ఉండాలని పేర్కొంది.
ఒకవేళ ద్రవిడ్ ఇదే పదవిలో కొనసాగాలనుకుంటే, తిరిగి అప్లై చేసుకోవచ్చని ఇటీవల బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు. "రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియనుంది. పదవిలో కొనసాగాలనుకుంటే మళ్లీ అప్లై చేసుకోవాలి. ఒక మూడేళ్ల పాటు జట్టుతో కలసి ప్రయాణించే కోచ్ కావాలని ఆశిస్తున్నాం" అని షా మాట్లాడారు.
నవంబరు 2021 నుంచి కోచ్ పదవిలో కొనసాగిన ద్రవిడ్‌కు మరో మూడేన్నరేళ్ల పాటు బాధ్యతలు కొనసాగించడం కొంచెం కష్టంతో కూడుకున్న పనే. వాస్తవానికి గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్‌తోనే ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. దక్షిణాఫ్రికాలో టీమిండియా టూర్, అమెరికాలో టీ20 వరల్డ్ కప్‌కు కొత్త కోచ్‌ను అపాయింట్ చేసేందుకు సమయం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కంటిన్యూ చేయాల్సి వచ్చింది.
కొత్త కోచ్‌గా బాధ్యతలు తీసుకునే వ్యక్తి శ్రీలంకలో జరిగే టెస్టు మ్యాచ్ బాధ్యతలు అందుకోవాలి. ఆ తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, సొంతగడ్డపై జరిగే బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో టెస్టు సిరీస్‌లు, 2025లో పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్ ట్రోఫీ, ఇంగ్లాండ్ టూర్, ఆ తర్వాత శ్రీలంకలో జరగబోయే టీ20 వరల్డ్ కప్, 2027లో దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లకు కూడా అటెండ్ కావాల్సి ఉంటుంది. వీటన్నిటితో పాటు టీమిండియాలో ప్రస్తుత సీనియర్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో కలిసి జట్టును ముందుకు నడిపించాల్సి ఉంటుంది.
గుజరాత్ కథ ముగిసింది - ఎవరివో ఆ మూడు బెర్తులు? - IPL 2024 PlayOffs
రంజీ ట్రోఫీ ఫార్మాట్ ఛేంజ్- ఇకపై రెండు దఫాలుగా- ఎందుకంటే? - Ranji Trophy 2024