Indian Domestic Cricket: సాధారణంగా ఆయా దేశాల డొమెస్టిక్ టోర్నమెంట్స్‌లో విదేశీ ఆటగాళ్లు పాల్గొంటుంటారు. అంతర్జాతీయ స్టార్లు ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్, ఆస్ట్రేలియా షెఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్‌లో తరచూ కనిపిస్తుంటారు. అయితే ఇండియా డొమెస్టిక్ టోర్నమెంట్స్ రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీలో ఇతరులకు ప్రవేశం లేదు. బీసీసీఐ విదేశీ ఆటగాళ్లను ఈ టోర్నమెంట్స్‌లో పాల్గొనడానికి అనుమతించదు. అలా ఎందుకు చేస్తుందో? ఇప్పుడు చూద్దాం.
భారత క్రికెట్ బోర్డు స్థానిక ప్రతిభను పెంపొందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా చాలా మంది క్రికెటర్లు ఉన్నందున, దులీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ వంటి టోర్నమెంట్‌లను భారత ఆటగాళ్లకు మాత్రమే కేటాయించాలని బోర్డు అభిప్రాయపడింది. ఈ టోర్నీలు స్థానిక క్రికెటర్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించి జాతీయ జట్టులో స్థానం సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. ఈ విధానం ద్వారా అంతర్జాతీయ స్టార్‌ల క్రేజ్ యువ ఆటగాళ్లకు అడ్డంకిగా మారదు. స్థానిక క్రికెటర్లు తమదైన ముద్ర వేయడానికి మరిన్ని అవకాశాలు లభిస్తాయి. ఇండియా డొమెస్టిక్ క్రికెట్‌లో చాలా పోటీ ఉంటుంది. దేశంలో మొత్తం 38 జట్లు ఉన్నాయి. భవిష్యత్తు అంతర్జాతీయ స్టార్‌లకు ఈ టోర్నీలు కఠినమైన పరీక్షా మైదానంగా ఉండేలా బీసీసీఐ చూసుకుంది.
ఆ దేశాల డొమెస్టిక్ టోర్నీలకు అనుమతి
అయితే ఇంగ్లాండ్‌లోని కౌంటీ క్రికెట్ అనేది ECB (ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు) నిర్వహించే అంతర- రాష్ట్ర టోర్నమెంట్. ఇందులో టూ-డివిజన్ లీగ్ ఫార్మాట్‌లో 18 జట్లు ఉంటాయి. క్రికెట్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెట్ ప్రతి షెఫీల్డ్ షీల్డ్, ప్లంకెట్ షీల్డ్ జట్లలో కనీసం ఒక ఆటగాడిని ఆడేందుకు అనుమతిస్తాయి. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, పాకిస్థాన్, శ్రీలంక క్రికెట్ బోర్డులు కూడా విదేశీ ఆటగాళ్లను తమ దేశీయ రెడ్-బాల్ టోర్నీల్లో అనుమతించే అవకాశం కలిగి ఉన్నాయి. అయితే ఈ దేశాల్లో చాలా అరుదుగా విదేశీ ఆటగాళ్లు పాల్గొంటారు.
ఇప్పటి వరకు ఆడిన ప్లేయర్లు వీళ్లే
ఇండియా డొమెస్టిక్ సర్క్యూట్‌లో విదేశీ క్రికెటర్లు పాల్గొనే అవకాశాన్ని బీసీసీఐ మూసివేసింది. గతంలో భారత దేశవాళీ క్రికెట్‌లో విదేశీ ఆటగాళ్లు కనిపించిన సందర్భాలు చాలా అరుదు. రంజీ ట్రోఫీలో ఆడిన విదేశీ క్రికెటర్లలో తన్మయ్ మిశ్రా, జార్జ్ అబెల్, కబీర్ అలీ, ఇనాముల్ హక్ జూనియర్, రాయ్ గిల్‌క్రిస్ట్, డెన్నిస్ కాంప్టన్, విక్రమ్ సోలంకి ఉన్నారు.
2007 వన్డే ప్రపంచ కప్‌లో కెన్యాకు ప్రాతినిధ్యం వహించిన తన్మయ్ మిశ్రా, రంజీ ట్రోఫీ 2019/20 సీజన్‌లో త్రిపుర తరఫు ఆడాడు. భారత దేశవాళీ టోర్నీలకు విదేశీ ఆటగాళ్లకు అనుమతి ఇవ్వకపోవడంపై బీసీసీఐ విమర్శలు ఎదుర్కొంది. ఇలా చేయడం వల్ల అంతర్జాతీయ క్రికెటర్లతో పోటీ పడే, సుదీర్ఘ ఫార్మాట్‌లో విలువైన అనుభవం పొందే అవకాశాలను స్థానిక ఆటగాళ్లు కోల్పోతారని విమర్శకులు వాదించారు.
రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీలు భారత క్రికెట్‌లో కీలకమైన భాగాలు. టెస్ట్ మ్యాచ్‌లలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించే ఆటగాళ్లకు ముఖ్యమైన వేదికలు. ఇవి క్రికెటర్ నైపుణ్యంలోని ప్రతి అంశాన్ని సవాలు చేస్తాయి. అంతర్జాతీయ ఆటగాళ్లను ఈ పోటీలకు దూరంగా ఉంచడం ద్వారా, దేశీయ ఆటగాళ్లు తదుపరి స్థాయికి వెళ్లేందుకు స్పష్టమైన మార్గాన్ని అందించాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది.
దులీప్ ట్రోఫీ స్క్వాడ్స్ ఔట్ - రోహిత్, కోహ్లీ నో ఇంట్రెస్ట్! - Duleep Trophy 2024