Ayush Badoni IPL: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ యంగ్ బ్యాటర్ ఆయుష్ బదోని పేరు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో మార్మోగిపోతోంది. పీకల్లోతూ కష్టాల్లో ఉన్న జట్టుకు భారీ స్కోరు అందించాడు. తీవ్ర ఒత్తిడిలోనూ బౌండరీలలో చెలరేగాడు. దీంతో లఖ్ నవూ జట్టు దిల్లీతో శుక్రవారం(ఏప్రిల్ 12) జరిగిన మ్యాచ్‌లో గౌరవప్రదమైన పరుగులు చేసింది. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేయగలిగింది. ఆ జట్టు ఇంత స్కోరు చేయగలిగిందంటే అదంతా ఆయుష్ బదోని పుణ్యమే. 35 బంతులు ఎదుర్కొన్న బదోని 5ఫోర్లు, 4సిక్సర్లతో 55 పరుగులు చేశాడు.
అయితే ఈ మ్యాచ్ లో లఖ్‌నవూ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ ఛేదించినా, ఆయుష్ బ్యాటింగ్ మాత్రం క్రికెట్ ప్రియులను ఆకట్టుకుంది. తీవ్ర ఒత్తిడిలోనూ యువ క్రికెటర్ మంచి బ్యాటింగ్ చేశాడని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా పలుమార్లు ఆయుష్ బదోని తీవ్ర ఒత్తిడిలో కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
2022 ఐపీఎల్ (15 సీజన్)లో తన అరంగేట్ర మ్యాచ్‌లో గుజరాత్ పై అదరగొట్టాడు ఆయుష్ బదోని. 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును అర్ధ శతకంతో ఆదుకున్నాడు. యువ ఆటగాడిగా టీ20ల్లో ఏమాత్రం అనుభవం లేకపోయినా కఠిన పరిస్థితుల్లో బ్యాటింగ్ చేశాడు. రషీద్‌ఖాన్, లాకీ ఫెర్గూసన్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్ల ఓవర్లలో సిక్సులు బాదాడు. 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేశాడు.
2023 ఐపీఎల్ (16 సీజన్)లో చెన్నై సూపర్ కింగ్స్ పై హాఫ్ సెంచరీ చేశాడు ఆయుష్ బదోని. 44 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన బదోని అద్భుతమైన ఇన్సింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా బదోనీ ఒక్కడే పోరాడాడు. ఈ మ్యాచ్‌లో బదోనీ 33 బంతుల్లో 59 పరుగులు చేసి టీమ్ ఆదుకున్నాడు. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఫలితం తేలలేదు. దీంతో ఇరుజట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి.
మయాంక్ యాదవ్ గాయం - బిగ్ అప్డేట్ ఇచ్చిన కేఎల్ రాహుల్ - KL Rahul Mayank Yadav
కొత్త కుర్రాడి మెరుపులు - లఖ్‌నవూపై దిల్లీ విజయం - LSG vs DC IPL 2024