Ambati Rayudu On Rohit Sharma: ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపై ఐపీఎల్ 2024 ప్రారంభంలో మొదలైన చర్చలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. గతేడాది చివరిలో అనూహ్యంగా ముంబయి ఇండియన్స్ మేనేజ్‌మెంట్ రోహిత్‌ను ఎంఐ కెప్టెన్సీ నుంచి తప్పించి, హార్దిక్‌కి పగ్గాలు అప్పగించింది. ఈ నిర్ణయం హిట్‌మ్యాన్ ఫ్యాన్స్‌నే కాదు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్, మాజీ ప్లేయర్‌లను కూడా ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఫ్యాన్స్ ఎంఐ మ్యాచ్‌లు జరిగే స్టేడియాల్లో, సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు రోహిత్‌కి సంబంధించి మరో ఆసక్తికర చర్చ మొదలైంది.
ఈ ఏడాది చివరి నాటికి IPL మెగా వేలం జరగనున్న నేపథ్యంలో, రోహిత్ శర్మ వేరే ఫ్రాంచైజీకి మారే అవకాశం ఉందని చాలా మంది వెటరన్ క్రికెటర్లు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో వెటరన్ చెన్నై సూపర్ కింగ్స్(CSK) బ్యాటర్ అంబటి రాయుడు ఇటీవల ఈ విషయంపై మాట్లాడాడు. రోహిత్ శర్మ వంటి ఆటగాడు లభిస్తే సీఎస్కే సంతోషిస్తుందని చెప్పాడు. ఇక రోహిత్‌ను ఐపీఎల్లో ఏ జట్టైనా ఆహ్వానించి కెప్టెన్‌గా చేయడానికి ఇష్టపడుతుందని తాజాగా అన్నాడు. 'ఏ ఫ్రాంచైజీకి వెళ్లాలనేది రోహిత్ శర్మ నిర్ణయం. ఐపీఎల్‌లోని అన్ని జట్లూ రోహిత్‌ని కెప్టెన్‌గా చేసుకోవాలని కోరుకుంటాయి. ఇక్కడ జరిగిన దానికంటే అతన్ని బెటర్‌గా ట్రీట్ చేసే ఫ్రాంచైజీకి వెళ్తాడు' అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ శర్మను తీసుకోవడానికి LSG సిద్ధంగా ఉందా?
రోహిత్ శర్మ నెక్స్ట్ సీజన్‌లో ఏ జట్టుకు ఆడుతాడనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ సమయంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ కూడా తమ జట్టులోని రోహిత్‌ని తీసుకోవడంపై ఆసక్తిని కనబరిచాడు. ఓ ఇంటర్వ్యూలో జస్టిన్ లాంగర్‌ని ఏదైనా IPL జట్టు నుంచి ఓ ప్లేయర్‌ని తీసుకునే అవకాశం ఉంటే ఎవరిని తీసుకుంటారు అని ప్రశ్నించారు? దీనికి లాంగర్ నవ్వుతూ మీరు ఎవరైతే బావుంటుందని అనుకుంటున్నారు? అని తిరిగి ప్రశ్నించాడు. ఇంటర్వ్యూయర్ స్పందిస్తూ మీ టీమ్‌లో అన్ని ప్లేసెస్ కవర్ అయ్యాయి, రోహిత్ శర్మని తీసుకోగలరా? అని అడిగాడు. జస్టిన్ లాంగర్ నవ్వు ఆపుకోలేకపోయాడు 'రోహిత్ శర్మా? అతడిని ముంబయి నుంచి పొందడం సాధ్యమా! సరే అతన్ని తీసుకొంటాం, మీరే నెగోషియేటర్‌గా ఉండండి' అని చెప్పాడు.
దిల్లీ క్యాపిటల్స్‌కి హిట్‌మ్యాన్
రోహిత్ దిల్లీ క్యాపిటల్స్‌లో చేరడంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. దిల్లీ క్యాపిటల్స్ యజమాని పార్త్ జిందాల్ హిట్‌మ్యాన్‌ను స్వాగతించినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ సీజన్‌లో ముంబయి జట్టు నుంచి ట్రేడ్ చేయడం ద్వారా రోహిత్, దిల్లీ క్యాపిటల్స్‌లో చేరవచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి.
ఇవన్నీ పక్కనపెడితే, రోహిత్ మనసులో ఏముందో తెలియాలంటే మెగా ఐపీఎల్ వేలం వరకు వేచి చూడక తప్పదు. సరిగ్గా ఇదే రోజు అంటే 2011 ఏప్రిల్ 10న రోహిత్ ముంబయితో ఆడటం ప్రారంభించాడు.
ఐపీఎల్లో రోహిత్ మరో ఘనత- దిల్లీపై క్రేజీ రికార్డ్ - Rohit Sharma IPL Record