Aman Sehrawat Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా జరిగిన రెజ్లింగ్ పోటీల్లో కాంస్యం సాధించిన యంగ్ అథ్లెట్ అమన్ సెహ్రావత్ తాజాగా బరువు తగ్గడం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. పతక పోరుకు ముందు మూడున్నర కిలోలు పెరిగానని, అయితే ఆ బరువు తగ్గించుకోవడం కోసం రాత్రంతా కసరత్తులు చేసి ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదని అమన్ తాజాగా పేర్కొన్నాడు.
"పోటీల్లో పాల్గొనే 15-20 రోజుల ముందే మనం మన బరువును సెట్ చేసుకోవాలి. కానీ, బౌట్‌ల సమయంలో బరువు అనేది సమస్యగా మారుతుంది. కాంస్య పతక బౌట్‌కు ముందు నా బరువు సుమారు 3.5 కిలోల మేర పెరిగింది. దీంతో ఆ పెరిగిన వెయిట్‌ను తగ్గించుకునేందుకు రాత్రంతా అస్సలు నిద్రపోలేదు. కొన్నిసార్లు కొంచెం నీరు తాగినా కూడా మనం బరువు పెరుగుతాం. బౌట్ జరిగే ముందురోజు రాత్రి మాత్రమే కాదు, రెండు రోజుల ముందు కూడా నిద్రపోవటం అనేది మాకు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మేము బరువు తగ్గే క్రమంలో ఖాళీ కడుపుతో ఉండాల్సి ఉంటుంది. ఏమీ తిననప్పుడు మనకు నిద్ర పట్టదు. పైగా రెజ్లింగ్ చేయడం చాలా కష్టంతో కూడుకున్నది. అందుకే రెజ్లర్ల ఇబ్బందిని దృష్టి ఉంచుకొని బౌట్ సమయంలో బరువు విషయంలో నిర్వాహకులు రెండు కిలోల మినహాయింపు ఇవ్వాలి" అంటూ అమన్ సెహ్రావత్ కోరాడు.
Aman Sehrawat Weight Loss: పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ 57కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్లో యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ పోటీకి ముందు ఉండాల్సిన (57 కేజీలు) దానికంటే అధిక బరువున్నాడు. రీసెంట్గా వినేశ్ ఫొగాట్ ఇదే కారణంతో డిస్క్వాలిఫై అవ్వడం వల్ల అమన్‌పై కూడా అనర్హత వేటు పడుతుందేమోనని అభిమానుల్లో ఆందోళన కలిగింది. కానీ, అమన్ సెహ్రావత్ విషయంలో మేనేజ్‌మెంట్ జాగ్రత్తలు తీసుకుంది.
సెమీస్‌లో ఓడిన తర్వాత అమన్ బరువు 61.5 కేజీలు ఉందట. దీంతో అమన్ బరువుపై శ్రద్ధ తీసుకున్నాడు. కాంస్య పోరు (శుక్రవారం రాత్రి) నాటికి 57 కేజీలకు తగ్గడానికి కఠినంగా శ్రమించాడు. కేవలం 10 గంటల వ్యవధిలోనే ఏకంగా 4.6కేజీలు తగ్గాడు. దానికోసం సీనియర్ కోచ్‌లు జగమందర్ సింగ్, వీరేందర్ దహియాతోపాటు మరో ఆరుగురి బృందం కష్టపడింది.
10గంటల్లో 4.6కేజీలు తగ్గిన అమన్- లేకుంటే మళ్లీ అది రిపీట్ అయ్యేదే! - Paris Olympics