Sachin Virat Record Comparison: సచిన్ తెందూల్కర్‌ని 'గాడ్ ఆఫ్ క్రికెట్'గా పేర్కొంటారు. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో సచిన్ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఈ రికార్డులను ఎవ్వరూ బద్ధలు కొట్టలేరని చాలా మంది భావించారు. కానీ ఓ సందర్భంలో సచిన్ మాట్లాడుతూ, తన రికార్డులు బద్ధలు కొట్టే అవకాశం కోహ్లి, రోహిత్‌కి ఉందని చెప్పాడు.అందులో కొన్ని సచిన్ రికార్డులను కోహ్లి బద్దలు కొడితే, మరి కొన్నింటిని రోహిత్ అందుకున్నాడు. అయితే తెందూల్కర్ రికార్డులకు కొన్నింట్లో కోహ్లీ దగ్గరగా ఉన్నప్పటికీ అతడు వాటిని అందుకోవడం చాలా కష్టం అనే చెప్పాలి. మరి పరుగుల రారాజు కోహ్లీ, అందుకోలేని సచిన్ రికార్డులు ఏంటంటే?
టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు
సచిన్ టెస్టు క్రికెట్‌లో 15,921 పరుగులు చేశాడు. అయితే ఈ మార్కుకు చేరువగా అయినా రావాలంటే కోహ్లీ మరి కొన్ని సంవత్సరాలు క్రికెట్‌లో కొనసాగాలి. అద్భుతంగా పరుగులు చేయాలి. కోహ్లీ ఇప్పటి వరకు 8848 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ ప్రస్తుత వయసు 35 సంవత్సరాలు. విరాట్ ఇంకొంత కాలమే క్రికెట్ ఆడగలడు. అందులో టెస్టు మ్యాచ్‌లు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల టెస్టుల్లో సచిన్ పరుగులను విరాట్ అధిగమించడం దాదాపు అసాధ్యమే. కానీ, ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్(33) ప్రస్తుతం 12274 పరుగులతో ఉన్నాడు. ఇంకొంత కాలం జో రూట్ అద్భుతంగా రాణిస్తే సచిన్‌కి దగ్గరగా రావచ్చు.
అత్యధిక సెంచరీలు
విరాట్ ఇప్పటికే 80 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. సచిన్ 100 సెంచరీల రికార్డును చేరుకోవాలంటే కోహ్లీ ఇంకా చాలా కష్టపడాలి. కొన్నేళ్లుగా విరాట్ సెంచరీల వేగం తగ్గింది. చాలా తక్కువ కాలమే విరాట్ క్రికెట్‌లో కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రికార్డు కూడా బద్దలయ్యే ఛాన్స్ లేదు!
డబుల్ సెంచరీలు
వన్డేల్లో తొలిసారిగా డబుల్ సెంచరీ సాధించిన సచిన్ చరిత్ర సృష్టించాడు. అనంతరం రోహిత్ ఈ రికార్డును మూడు సార్లు అందుకున్నాడు. కోహ్లీకి మాత్రం వన్డేల్లో డబుల్ సెంచరీ సాధ్యం కాలేదు. వన్డేల్లో కోహ్లి అత్యధిక స్కోరు 183.
అత్యధిక పరుగులు
వన్డేల్లో సచిన్ అత్యధికంగా 18,426 పరుగులు చేశాడు. విరాట్ ప్రస్తుతం 13906 పరుగుల వద్ద ఉన్నాడు. ఈ రికార్డును బద్దలు కొట్టాలంటే కోహ్లీకి ఇంకా చాలా సంవత్సరాలు కావాలి.
అంతర్జాతీయ మ్యాచ్‌లు
సచిన్ మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. కోహ్లీ అంతకంటే తక్కువ మ్యాచ్‌లు(533) ఆడాడు. ఇప్పటి డిమాండ్, టీ20కి విరాట్ రిటైర్‌మెంట్, పని భారం పరిగణనలోకి తీసుకుంటే ఈ రికార్డును విరాట్ అందుకోలేడు.
'విరాట్‌ది పరుగుల ఆకలి'- కోహ్లీపై హిట్‌మ్యాన్ ప్రశంసలు - Rohit Sharma On Virat Kohli