Rohit Sharma Border Gavaskar Trophy : టీమ్ ఇండియాకు గట్టి షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న కీలక బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మొదటి రెండు టెస్టులకు లేదా అందులో ఏదైనా ఒక మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు చెప్పాయి. అయితే రోహిత్ కెప్టెన్సీలో భారత్ టెస్టుల్లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇటీవలే బంగ్లాదేశ్‌పై కూడా అద్భుత విజయం అందుకుంది.
2024 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలను అంతకంతకూ పెంచుకుంటున్న భారత్‌కు, ఇప్పుడు గావస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం ఒకరకంగా మైనస్ అనే చెప్పాలి! ఒకవేళ నిజంగానే రోహిత్ అందుబాటులో లేకపోతే టీమ్ ఇండియా ఎదుర్కొనే మూడు ప్రధాన సమస్యలు ఏంటంటే?
రోహిత్ కెప్టెన్సీని ఎవరు భర్తీ చేస్తారు? - రోహిత్ శర్మ కెప్టెన్సీని టీమ్ ఇండియా కోల్పోతుంది. అతడి వ్యూహాత్మక విధానం చాలా కీలకం. ముఖ్యంగా ఆస్ట్రేలియా వంటి బలమైన ప్రత్యర్థులపై పైచేయి సాధించాలంటే రోహిత్ లాంటి అనుభవమున్న, తెలివైన కెప్టెన్ అవసరం. రోహిత్ అందుబాటులో లేకపోతే తాత్కాలిక కెప్టెన్ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. ఇది జట్టు ప్రయాణానికి కాస్త అంతరాయం కలిగించవచ్చు. క్లిష్టమైన సమయాల్లో పేలవమైన నిర్ణయాలకు దారితీయవచ్చు.
ఓపెనర్లు ఎవరు? - ఓపెనర్‌గా రోహిత్ శర్మ పాత్ర కీలకం. ఫాస్ట్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడం, మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి పార్ట్‌నర్‌షిప్‌లు నెలకొల్పడంతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతాడు. అతడు లేకపోతే టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ బ్యాలెన్స్ కోల్పోవచ్చు. ఈ సమస్యతో ఆస్ట్రేలియా పిచ్‌లపై మంచి ప్రారంభాలు లభించకపోవచ్చు. రోహిత్ ఆడకపోతే అతడి స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ జట్టులోకి రావచ్చు.
జట్టు మనోబలంపై ప్రభావం - డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ శర్మ ఉంటే జట్టు ధైర్యం, ఐక్యత పెరుగుతాయి. అతడు లేకపోవడం జట్టు స్ఫూర్తిని, వ్యూహాత్మక చర్చలను ప్రభావితం చేస్తుంది. రోహిత్ నాయకత్వం, అనుభవాన్ని కోల్పోవడం ఆత్మవిశ్వాసాన్ని తగ్గించవచ్చు. కీలక సమయాల్లో భారత్ దృష్టిని నిలబెట్టుకోవడం కష్టమవుతుంది.
రోహిత్ ఎందుకు దూరమయ్యాడు? - వ్యక్తిగత కారణాలతో రోహిత్ శర్మ మొదటి రెండు టెస్టులు ఆడకపోవచ్చని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. నవంబర్ 22-26 మధ్య పెర్త్‌లో మొదటి టెస్టు, డిసెంబరు 6-10లో అడిలైడ్‌లో రెండో టెస్టు జరుగుతాయి. ఒకవేళ సిరీస్ ప్రారంభానికి ముందు రోహిత్ వ్యక్తిగత సమస్య పరిష్కారమైతే ఐదు టెస్టులు ఆడతాడని సమాచారం.
ఉప్పల్ టీ20కు వర్షం పడుతుందా? - క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన టీమ్ ఇండియా!
'కోహ్లీ బ్యాట్ వల్ల నా ఇమేజ్ దెబ్బతింది - ఇకపై ఎవర్నీ బ్యాట్ ఆడగను'