2024 Women's T20 World Cup : దుబాయ్ వేదికగా గురువారం (అక్టోబర్ 03) ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో టీమ్ఇండియా మహిళల జట్టు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి ఎలాగైనా దేశానికి కప్పు అందించాలని భావిస్తోంది. అన్ని విభాగాల్లో సమష్ఠిగా రాణించి టీ20 వరల్డ్‌కప్ టైటిల్ ఎగరేసుకుపోవాలని హర్మన్ సేన ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో టీమ్ఇండియా బలాలేంటీ? జట్టు కూర్పు ఎలా ఉంది? తదితర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పటిష్ఠంగా బ్యాటింగ్, బౌలింగ్ లైనప్
హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళా జట్టు టీ20 వరల్డ్‌కప్ బరిలోకి దిగనుంది. మంచి బ్యాటింగ్ లైనప్, పటిష్ఠమైన బౌలింగ్ విభాగంతో పాటు అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో టీమ్ఇండియా బలమైన జట్టుగా ఈ మెగా టోర్నీ బరిలోకి దిగుతోంది. గత కొన్నాళ్లుగా అంతర్జాతీయ టోర్నీల్లో భారత మహిళల జట్టు స్థిరంగా రాణిస్తోంది. దీంతో టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. విధ్వంసకర బ్యాటర్లు, విన్నింగ్ ఆల్ రౌండర్లు టీమ్ఇండియా సొంతం. ఈ స్క్వాడ్ ప్రపంచంలోని అత్యుత్తమ జట్లకు సవాల్ విసిరే స్థాయికి చేరుకుందని క్రికెట్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.
హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్)
హర్మన్ ప్రీత్ కౌర్ ప్రస్తుతం టీమ్ఇండియా మహిళల జట్టుకు కెప్టెన్‌గా ఉంది. ఆమె తనదైన దూకుడు బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేయగల సామర్థ్యం ఉన్న బ్యాటర్. 2017 ప్రపంచకప్‌లో ఓ మ్యాచ్ లో 171 పరుగులు బాది సత్తాచాటింది. కఠినమైన మ్యాచ్‌ల్లోనూ జట్టను విజయవంతంగా నడుపగల సమర్థురాలైన కెప్టెన్ కూడా. ఆమెకు టీ20 క్రికెట్లో అపారమైన అనుభవం ఉంది. 173 టీ20ల్లో 3,426 పరుగులు చేసింది. అందులో ఒక సెంచరీ, 12 అర్ధశతకాలు ఉన్నాయి. కాగా, 2023 ప్రపంచకప్‌లో 5 మ్యాచ్‌ల్లో 118 పరుగులు చేసి ఫర్వాలేదనిపించింది.
స్మృతి మంధన (వైస్ కెప్టెన్)
ప్రపంచ క్రికెట్లో అత్యంత నిలకడైన బ్యాటర్లలో స్మృతి మంధన ఒకరు. ఆమె భారత మహిళ జట్టు టాప్ ఆర్డర్‌కు ప్రధాన బలం. అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో దూకుడుగా బ్యాటింగ్ చేయడంలో మంధన దిట్ట. ఒత్తిడిని ఎదుర్కొని రాణించగలగడం స్మృతి మంధనలో ఉన్న స్పెషల్. 141 టీ20లు ఆడిన మంధన 3,493 పరుగులు చేసింది. అందులో 26 అర్ధశతకాలు ఉన్నాయి. 2023 టీ20 మహిళల వరల్డ్‌కప్‌లో 4 మ్యాచ్ ల్లో 151 పరుగులతో రాణించింది.
షఫాలీ వర్మ
టీమ్ఇండియాలో దూకుడైన బ్యాటర్ షఫాలీ వర్మ. ఈ యువ ప్లేయర్ ఇటీవల కాలంలో నిలకడగా రాణిస్తోంది. ప్రత్యర్థి జట్ల అగ్ర బౌలర్లను సైతం ఎదుర్కొని భారీగా పరుగులు చేస్తోంది. 81 టీ20లు ఆడిన షఫాలీ వర్మ 1,948 పరుగులు చేసింది. అందులో 10 అర్ధశతకాలు ఉన్నాయి. అలాగే బౌలింగ్‌లో 10 వికెట్లు పడగొట్టింది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో షఫాలీ 5 మ్యాచ్‌ల్లో 102 పరుగులు చేసింది.
దీప్తి శర్మ
భారత మహిళల జట్టుకు దొరికిన అద్భుతమైన ఆల్ రౌండర్ దీప్తి శర్మ. ఆమె బ్యాట్, బంతితో అదరగొడుతోంది. మిడిల్ ఓవర్లలో ఆమె ఆఫ్ స్పిన్‌తో ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను ఇబ్బంది పెడుతోంది. 117 టీ20 మ్యాచ్‌లు ఆడిన దీప్తి 1,020 పరుగులు చేసింది. అందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 131 వికెట్లు పడగొట్టింది. కాగా, 2023 టీ20 ప్రపంచకప్‌లో దీప్తి 5 మ్యాచ్‌ల్లో 27 పరుగులు, 6 వికెట్లు తీసింది.
రేణుకా సింగ్ ఠాకూర్
ఈ యువ పేసర్ బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలదు. రేణుక తనదైన శైలిలో బంతులను వేసి ప్రత్యర్థి టాప్ ఆర్డర్‌ను ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా యూఏఈ వంటి ఫాస్ట్ ట్రాక్ పిచ్ లపై రేణుక రెచ్చిపోయే అవకాశం ఉంది. ఇప్పటివరకు 47 టీ20లు ఆడిన రేణుక 50 వికెట్లు పడగొట్టింది. గత సీజన్లో 5 మ్యాచ్ ల్లో 7 వికెట్లు పడగొట్టింది.
𝗠𝗮𝗿𝗸 𝗬𝗼𝘂𝗿 𝗖𝗮𝗹𝗲𝗻𝗱𝗮𝗿 🗓️#TeamIndia's schedule for the ICC Women's #T20WorldCup 2024 is 𝙃𝙀𝙍𝙀 🔽 pic.twitter.com/jbjG5dqmZk
— BCCI Women (@BCCIWomen) August 26, 2024
షెడ్యూల్ ఇదే!
కాగా, అక్టోబరు 03 - 20 వరకు యూఏఈలోని షార్జా క్రికెట్ స్టేడియం, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మహిళల టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనే మొత్తం 10 జట్లను రెండు గ్రూప్ లుగా విభజించారు. గ్రూప్ Aలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్ Bలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి.
ఫైనల్
ఒక గ్రూప్ లోని ప్రతి జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి టాప్- 2లో నిలిచిన జట్లు సెమీస్ కు చేరుతాయి. అక్టోబరు 17, 18వ తేదీల్లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అదే నెల 20న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా టీమ్ఇండియా అక్టోబర్ 4న న్యూజిలాండ్, 6న పాకిస్థాన్, 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది.
భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
2024 టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీని ఐసీసీ భారీగా పెంచింది. 79,58,080 అమెరికా డాలర్లుగా నిర్ణయించింది. అంటే భారత కరెన్సీలో రూ.66 కోట్లకు పైమాటే. దీంతో విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీ కూడా పెరిగింది. గతేడాది జరిగిన టోర్నీలో ఆస్ట్రేలియా విజేతగా నిలవగా ఆ జట్టుకు 1 మిలియన్ డాలర్లు ఇచ్చారు. అదే ఈసారి ఈ ప్రైజ్ మనీని 2.34 మిలియన్ డాలర్లకు పెంచారు. అంటే ఏకంగా 134 శాతం పెరిగింది. భారత కరెన్సీలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ విన్నర్‌కు దాదాపు రూ.19 కోట్లకు పైగా ప్రైజ్ మనీ అందుతుంది.
ఛాంపియన్లుగా నిలిచిన జట్లు
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2009లో ప్రారంభమైంది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా అత్యధికంగా ఆరుసార్లు ఈ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ ఒక్కొసారి ఈ కప్పును గెలిచాయి. ఇంతవరకు ఇతర జట్లు ఏవి మహిళల టీ20 ప్రపంచకప్ ముద్దాడలేదు. ఇప్పటివరకు విజేతగా నిలిచిన జట్లు ఇవే.
- 2009- ఇంగ్లాండ్
- 2010- ఆస్ట్రేలియా
- 2012- ఆస్ట్రేలియా
- 2014- ఆస్ట్రేలియా
- 2016- వెస్టిండీస్
- 2018- ఆస్ట్రేలియా
- 2020- ఆస్ట్రేలియా
- 2023- ఆస్ట్రేలియా
వరల్డ్ కప్ - ఇక అమ్మాయిల వంతు వచ్చేసింది - ఈసారి ఏం చేస్తారో? - Women T20 World Cup 2024