Goddess Durga Puja 2024 : వ్యాస మహర్షి రచించిన దేవీభాగవతంలో వివరించిన ప్రకారం, దుర్గమ్మ తల్లిని ఆరాధిస్తే ఆపదలు, గండాలు తొలగిపోవడమే కాకుండా దారిద్య్ర బాధలు తొలగిపోయి, ఐశ్వర్యం లభిస్తుందని అంటారు. అందుకే ఆ చల్లని తల్లి దుర్గమ్మను ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వారంలో రెండు రోజులు
దుర్గా పూజకు మంగళవారం, శుక్రవారం శుభకరంగా ఉంటాయి. మీ వీలుని బట్టి ఏ రోజైనా పూజ చేసుకోవచ్చు. కోరికలు తీరడం కోసం, ఏదైనా కష్టం తొలగించుకోవడం కోసం పూజ చేయాలనుకునే వారు, ఖచ్చితంగా తాము అనుకున్న కొన్ని వారాల పాటు పూజ చేసుకోవాలి. ఇలా చేస్తే సత్వర ఫలితం ఉంటుంది. సాధారణంగా దుర్గాదేవికి 'నవ' అంటే తొమ్మిది సంఖ్య ప్రధానం కాబట్టి తొమ్మిది వారాలు ఈ పూజ చేసుకుంటే మంచిది.
పూజ ఎలా చేసుకోవాలి?
పూజ చేయాలనుకునే రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానపానాదులు ముగించుకుని, పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి. పసుపు రాసిన పీటకు కుంకుమ బొట్లు పెట్టి దానిపై ఎర్రని వస్త్రాన్ని పరచాలి. దుర్గాదేవి చిత్రపటాన్ని అమర్చుకోవాలి. అమ్మవారి పటానికి గంధం, కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఎర్రని పువ్వులు, నిమ్మకాయల దండలతో అమ్మవారిని అలంకరించాలి. ఆవు నేతితో దీపారాధన చేయాలి. ఒక నిమ్మకాయని రెండుగా కోసి వాటిలోని రసాన్ని తీసి వేసి వెనుక నుంచి డొప్పల్లా చేసుకొని అందులో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయాలి.
దేవి ఖడ్గమాలా స్తోత్రం
అమ్మవారి సమక్షంలో భక్తితో దేవి ఖడ్గమాలా స్తోత్రాన్ని పారాయణం చేయాలి. అనంతరం దుర్గా స్తుతి, దుర్గా అష్టోత్తర శతనామాలను చదువుకోవాలి. అమ్మవారికి పులగం, పరమాన్నం నివేదించాలి. కొబ్బరికాయ కొట్టి మంగళహారతులు ఇవ్వాలి. పూజ పూర్తయిన తర్వాత ఒక ముత్తైదువుకు తాంబూలం ఇవ్వాలి. ఇలా తొమ్మిది వారాలు పూర్తయ్యాక చివరి వారం ఉద్యాపన చేసుకునేటప్పుడు అమ్మవారి పేరు చెప్పి ముగ్గురు ముత్తైదువులకు భోజనం పెట్టి చీర, రవికె పెట్టి తాంబూలం ఇవ్వాలి.
పూజాఫలం
ఈ విధంగా భక్తిశ్రద్ధలతో దుర్గాదేవిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహంతో ఆపదలు, గండాలు పూర్తిగా తొలగిపోవడమే కాకుండా, దారిద్య్ర బాధలు పోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందని శాస్త్ర వచనం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఆర్థిక ఇబ్బందులు పోగొట్టే అజా ఏకాదశి వ్రతం! ఎలా చేసుకోవాలి? - Aja Ekadashi 2024
వినాయకుడిపైకి డైరెక్ట్‌గా సూర్యకిరణాలు! ఈ అద్భుతమైన టెంపుల్ ఎక్కడుందంటే? - Special Ganesh Temple