Yedu Varala Nagalu History In Telugu : ఎన్ని కాలాలు, యుగాలు మారినా బంగారానికి ఉన్న ఆదరణ మాత్రం తగ్గడం లేదు. హిందూ మతవిశ్వాసాల ప్రకారం చూసినా బంగారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. బహుశా అందుకేనేమో బంగారం విలువ పెరగడమే కానీ తగ్గడం అంటూ లేదు. మహిళలకు బంగారం పట్ల మక్కువ ఎక్కువ. కనీసం ఒక్క బంగారు నగ అయినా ఉండాలని కోరుకునే వారు ఎంతోమంది ఉంటారు. సమృద్ధిగా బంగారం ఉన్నవారు కూడా మార్కెట్లోకి కొత్త డిజైన్లు వస్తే వదిలిపెట్టరు. అందుకే బంగారం వ్యాపారం లాభసాటి అయిన వ్యాపారం.
ఏడువారాల నగలుంటే గొప్ప ప్రతిష్ట
దాదాపు 100ఏళ్ల క్రితం శ్రీమంతుల ఇంట్లో మహిళలకు ఏడు వారాల నగలుండేవి. ఇంట్లో మహిళలందరికీ ఏడు వారాల నగలుండడం ప్రతిష్ఠగా భావించేవారు. ముఖ్యంగా వివాహ సమయంలో వధువుకు ఏడువారాల నగలు పుట్టింటి వారు కానీ, అత్తింటి వారు కానీ పెట్టడం ఆనవాయితీగా ఉండేది.
ఏడు వారాల నగలంటే?
మనకు వారంలో ఏడు రోజులుంటాయి. ఒక్కో వారానికి ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో గ్రహం అనుకూలత కోసం ఒక్కో రకమైన రత్నాన్ని ధరించాల్సి ఉంటుంది. అందుకే వారంలోని ఏడురోజులపాటు ఏ రోజు ఏ రత్నం ధరించాలో ఆ ప్రకారం తయారు చేయించుకునేవే ఏడు వారాల నగలు. ఈ ప్రకారం ధరించడం వలన ఒక వారంలో అన్ని గ్రహాల అనుకూలతలు పొంది సుఖమయ జీవనం ఉంటుందని విశ్వాసం.
ఏ రోజు ఏ గ్రహానికి ఏ రత్నం ధరించాలి?
ఆదివారం
ఆదివారాన్ని భానువారమని కూడా అంటారు. ఆదివారం సూర్య గ్రహానికి చెందినది. ఈ రోజు కెంపులతో చేసిన ఆభరణాలను ధరిస్తే సూర్య గ్రహం అనుకూలతతో అనారోగ్య సమస్యలు దూరమై మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు చేకూరుతుంది.
సోమవారం
సోమవారాన్ని ఇందువారమని కూడా అంటారు. సోమవారానికి అధిపతి చంద్ర గ్రహం. ఈ రోజు ముత్యాలతో చేసిన ఆభరణాలను ధరించాలని శాస్త్రం చెబుతోంది. చంద్రుడు మనః కారకుడు కాబట్టి ముత్యాలతో చేసిన ఆభరణాలు ధరిస్తే మానసిక సమస్యలు దూరమై మనసు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది.
మంగళవారం
మంగళవారాన్ని జయవారమని కూడా అంటారు. మంగళవారానికి అధిపతి కుజుడు. కుజ గ్రహాన్నే అంగారక గ్రహమని కూడా అంటారు. మంగళవారం పగడాలతో చేసిన ఆభరణాలను ధరించాలని శాస్త్రం చెబుతోంది. మంగళవారం పగడాల నగలను ధరిస్తే కుజగ్రహ అనుకూలతతో వివాహం కానీ వారికీ వివాహం జరుగుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలుంటే తొలగిపోతాయి. సంతానం కోరుకునే వారికీ సంతాన ప్రాప్తి ఉంటుంది.
బుధవారం
బుధవారాన్ని సౌమ్య వారమని కూడా అంటారు. బుధవారానికి అధిపతి బుధుడు. ఈ రోజు మరకతం అంటే పచ్చలతో చేసిన ఆభరణాలు ధరించాలి. బుధవారం పచ్చల ఆభరణాలు ధరిస్తే బుధ గ్రహం అనుకూలతతో వృత్తి వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు బుద్ధి, జ్ఞానం, తెలివితేటలూ వృద్ధి చెందుతాయి.
గురువారం
గురువారాన్ని బృహస్పతి వారమని కూడా అంటారు. గురువారానికి దేవగురువు బృహస్పతి అధిపతి. ఈ రోజు పుష్యరాగం పొదిగిన ఆభరణాలను ధరించాలి. గురువారం పుష్యరాగాలు పొదిగిన ఆభరణాలను ధరిస్తే గురుగ్రహం అనుకూలించి ఐశ్వర్యం, ఆస్తి, ఉన్నత పదవులు, వివాహయోగం, విదేశీయానం, కుటుంబ సౌఖ్యం వంటి శుభ ఫలితాలు ఉంటాయి.
శుక్రవారం
శుక్రవారాన్ని భృగు వారమని కూడా అంటారు. శుక్రవారానికి అధిపతి శుక్రగ్రహం. శుక్రవారం వజ్రాలతో చేసిన పతకాలు, ముక్కుపుడక, కమ్మలు వంటి ఆభరణాలు ధరించాలి. శుక్రవారం వజ్రాల నగలు ధరిస్తే శుక్రుని అనుగ్రహం వలన విలాసవంతమైన జీవితం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం, అష్టైశ్వర్యాలు, సమాజంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి. దీనినే శుక్రమహర్దశ అంటారు.
శనివారం
శనివారాన్ని స్థిర వారమని కూడా అంటారు. శనివారానికి అధిపతి శని భగవానుడు. శనివారం రోజు నీలమణులు పొదిగిన ఆభరణాలు ధరించాలని శాస్త్రం చెబుతోంది. శనివారం నీలమణుల ఆభరణాలు ధరిస్తే శనిగ్రహం అనుకూలించి అకాల మరణ భయం, అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా తరచుగా పనుల్లో ఆటంకాలు ఎదురుకావడం, ఏళ్ల తరబడీ కోర్టు వ్యవహారాలు ఎటూ తేలకుండా ఉండటం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ఎంతో ప్రత్యేకం! ఏడు వారాల నగలు
పూర్వకాలంలో అయితే ఏడు వారాల నగలు ఎక్కువగా ధరించే వారు. ఎంత బంగారం ఉన్నా ఏడు వారాల నగలకు ప్రత్యేకతే వేరు. ఏడు రోజుల పాటు ఏడు గ్రహాల అనుకూలత కోసం ఏడు వారాల నగలను ధరిస్తే అదృష్టం వరిస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్న మాట. ఇది రుజువైన నిజం కూడా!
శుభం భూయాత్!
మూలం: వివిధ గ్రంథ కర్తలు రచించిన ప్రాచీన భారత జ్యోతిష్య శాస్త్రాలు