Vighnahar Temple At Ozar Significance : మహారాష్ట్రలో అష్ట వినాయక క్షేత్రాలలో ఏడో క్షేత్రంగా విఘ్నహార్ వినాయక క్షేత్రం భాసిల్లుతోంది. ఓఝూర్ పట్టణంలో కుకడి నది ఒడ్డున వెలసిన విఘ్నహార్ వినాయక క్షేత్రంలో వినాయకుడు సిద్ధి, బుద్ధి సమేతుడై కొలువుతీరి ఉంటాడు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయ స్థలపురాణం గురించి తెలుసుకుందాం.
ఆలయ స్థల పురాణం
పూర్వం ఈ ప్రాంతంలో విఘ్నాసురుడు అనే రాక్షసుడు మునులను హింసిస్తూ ఉండేవాడు. రాక్షసుని ఆగడాలను భరించలేక మునులంతా వినాయకుని ప్రార్థించారు. రాక్షసుని బారి నుంచి మునులను కాపాడుట కోసం వినాయకుడు విఘ్నాసురునితో యుద్ధం చేయడం మొదలు పెట్టాడు. అలా ఏకదంతుడు చాలా కాలం ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు.
వినాయకుని శరణు కోరిన విఘ్నాసురుడు
ఎంతోకాలంగా యుద్ధం చేసి అలిసిపోయిన తర్వాత ఇక వినాయకుని గెలవడం తన వల్ల కాదని గ్రహించిన ఆ రాక్షసుడు వినాయకుని శరణు కోరి, వినాయకుడు తన పేరు మీద ఇక్కడే కొలువు తీరాలని వేడుకున్నాడు. శరణు కోరిన రాక్షసుని కోరిక మేరకు వినాయకుడు అక్కడే కొలువయ్యాడు. అందుకే ఈ స్వామిని విఘ్నహార్ వినాయక్ అని అంటారు.
మునులు కట్టిన ఆలయం
రాక్షసుని బారి నుంచి తమకు విముక్తి కలిగించినందుకు కృతజ్ఞతగా అప్పట్లో ఈ స్వామికి మునులే ఆలయం కట్టించారు. తర్వాత కాలంలో చిమాజి అనే భక్తుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు. విఘ్నహార్ వినాయకుని ఆలయానికి బంగారు పూతతో మిలమిల మెరిసే ఆలయ శిఖరం చూపరులను ఎంతగానో ఆకర్షిస్తుంది.
తొలగిపోయే విఘ్నాలుఠ
విఘ్నహార్ వినాయక క్షేత్రంలో వినాయకుని దర్శించి ప్రార్థిస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో తరచుగా ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం. అంతేకాదు వివాహ ప్రయత్నాలలో ఎదురయ్యే ఆటంకాలు కూడా ఈ స్వామి దర్శనంతో తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మనం కూడా విఘ్నహార్ వినాయక క్షేత్రాన్ని దర్శిద్దాం విఘ్నాలు తొలగించుకుందాం. ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.