Vastu Tips For Happy Home : ఒక ఇంట్లో సానుకూల శక్తి ఉంటే ఇంట్లోని వారు అన్నింటా విజయం సాధిస్తారు. ఆ ఇల్లు ఎప్పుడూ నిత్య కల్యాణం పచ్చ తోరణం అన్నట్లుగా కళకళలాడుతూ ఉంటుంది. అదే ప్రతికూల శక్తి ఉన్న ఇల్లు కళావిహీనమై ఉంటుంది. ఆ ఇంట్లో నివసించే వారికి ఎలాంటి అభివృద్ధి ఉండదు. ఆ ఇంట్లో శుభకార్యాలు జరగవు. ఎప్పుడూ అనారోగ్యాలు, ఋణ బాధలతో ఇంట్లో దారిద్య్రం తాండవిస్తూ ఉంటుంది. ఇంట్లో ప్రతికూల శక్తి పోయి అనుకూల శక్తులు రావడానికి వాస్తు ప్రకారం ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.
సూర్య కిరణాలతో సానుకూల శక్తి
ఇంట్లోకి ధారాళంగా గాలి వెలుతురు ప్రసరిస్తూ ఉంటే ఆ ఇల్లు ఎప్పుడూ లక్ష్మీ కళతో విరాజిల్లుతూ ఉంటుంది. అంతే కాదు ఆ ఇంట్లో నివసించే వారికి శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు లోటుండదు. ఇందుకోసం ప్రతిరోజూ సూర్యోదయం సమయంలో కనీసం అర్ధగంట పాటు ఇంటి తలుపులు, కిటికీలు పూర్తిగా తెరిచి ఉంచాలి. సూర్య కాంతి పుంజాలు ఇంట్లో నలుమూలలా ప్రసరించాలి. ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుని కాంతి ఇంట్లో ప్రసరిస్తే ఆ ఇంట్లో దేదీప్యమైన అద్వితీయ శక్తులు ఉండి తీరుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
నిత్యపూజలు అడ్డుకుంటే అరిష్టం
ఇంట్లో నిత్యపూజలు జరగడం శుభకరం. అలా కాకుండా ఎవరైనా ఈ పూజలు అవీ చాదస్తం మానేయాలని ఇంట్లో తరచుగా అంటూ ఉంటే అది ఇంటికి చేటు చేస్తుంది.
రంగు వెలసిన ఇంట్లో పీడించే అనారోగ్యాలు
మనం నివసించే ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటేనే ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే కేవలం సంపద అనే కాదు సంపదను సృష్టించాలన్నా, పెంచాలన్నా ముందు ఇంట్లో వారు ఆరోగ్యంగా ఉండటం అవసరం. ఇంటి వెలుపలి గోడలకు ఏడాదికి ఒకసారి తప్పకుండా రంగులు వేయించాలి. రంగులు లేకుండా కళావిహీనంగా ఉన్న ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేస్తుంది. అనారోగ్యాల రూపంలో విపరీతమైన ధనవ్యయం, మానసిక అశాంతి నెలకొంటుంది.
ఈ వాస్తు దోషం ఉంటే అనర్ధం
ఇంటికి దక్షిణ నైరుతి మూలలో వాస్తు రీత్యా దోషం ఉంటే ఆ ఇంట్లో నివసించవద్దు. అలాంటి ఇంట్లో తీరని అప్పులు. కుటుంబ కలహాలు, అన్నదమ్ముల ఆస్తి తగాదాలు, కోర్టు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దక్షిణ నైరుతి దోషం ఉంటే డబ్బు మంచినీళ్లు లాగా ఖర్చయిపోతుంది. అందుకే అలాంటి ఇంట్లో నివసిస్తే జీవితంలో ఎలాంటి పురోగతి ఉండదు. ఒకవేళ సొంత ఇల్లు అయితే తక్షణమే వాస్తు పండితులను సంప్రదించి వాస్తు ప్రకారం మార్పులు చేర్పులు చేయించుకుంటే మంచిది.
తులసి మొక్క పరిరక్షణ బాధ్యత ఇంటి యజమానిదే!
ఇంట్లో తులసి మొక్కకు పెరిగిన వెన్నును అంటే విత్తనాలతో ఉన్న చిన్న కొమ్మ ను ఇంటి యజమాని దక్షిణం వైపుకు తిరిగి తుంచి వేయాలి. ఎప్పుడైనా ఇంట్లో తులసి పూజ ఇంటి ఇల్లాలు చేయాలి. తులసి మొక్క సంరక్షణ బాధ్యత మాత్రం ఇంటి యజమానిదే! తులసి మొక్క ఎండిపోతే ఇంటికి అరిష్టం. అందుకే తులసి మొక్కను జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. ఇంట్లో సానుకూల శక్తులు పెరిగి, అష్టైశ్వర్యాలు పొందడానికి వాస్తు నిపుణులు సూచించిన ఈ పరిహారాలు పాటిస్తూ మన జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం. శుభం భూయాత్
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
కాంపౌండ్ వాల్‌ను గుండ్రంగా నిర్మించుకోవచ్చా? వాస్తు ఏం చెబుతుంది! - Vastu Rules For Home