Vastu Shastra Tips For Home Interior Design : మనం ఏ నిర్మాణం చేసినా వాస్తు ప్రకారం కట్టడం చాలా మంచిది. అందుకే ప్రస్తుత కాలంలో ఏ నిర్మాణం చేపట్టినా కచ్చితంగా వాస్తును చూస్తున్నారు. చిన్న ఇంటి నుంచి కార్పొరేట్ ఆఫీస్ వరకు అన్నింటినీ వాస్తుకు అనుగుణంగానే నిర్మిస్తున్నారు. అయితే మన ఇంటిని అందంగా ఉంచడానికి చేసే ఇంటీరియర్ డిజైనింగ్‌లోనూ కచ్చితంగా వాస్తు శాస్త్రాన్ని పాటించాలని ప్రముఖ వాస్తు శాస్త్ర పండితులు మాచిరాజు వేణుగోపాల్ చెబుతున్నారు. ఇలా చేయటం ద్వారా మన కొత్త ఇంటిలో అంతా శుభం జరుగుతుందని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇంటి హాల్, కిచెన్, బెడ్ రూమ్‌లతో పాటు వివిధ ప్రదేశాలలో చేసే ఇంటీరియర్ డిజైనింగ్‌లో కొన్ని నియమాలు పాటించాలని ఆయన చెబుతున్నారు. మరి ఆ సూచనలేంటో తెలుసుకుందామా?
ఇంటీరియర్ డిజైనింగ్ - వాస్తు నియమాలు
- ఇంటి పైకప్పు
వాస్తు శాస్త్రంలో ఇంటి పైకప్పును ఐదో గోడగా భావిస్తారు. కనుక దీనిని ఎట్టి పరిస్థితుల్లో వంకరగా నిర్మించరాదు. ఒకవేళ ఇలా నిర్మిస్తే ఇంటి సభ్యులకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. పైకప్పు ఎత్తు తప్పనిసరిగా 10 నుంచి 12 అడుగులుండాలి. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది 8 అడుగుల ఎత్తులో పైకప్పు నిర్మిస్తున్నారు. దానివల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పై కప్పుకు అద్దాలు పెట్టకూడదు. ఇలా చేస్తే యజమానికి చెడు ఆలోచనలు వస్తాయి. అంతేకాకుండా గోడలకు ఎక్కువ అద్దాలు లేకుండా చూసుకోవటం మంచిది. ఇంటి కప్పుకు స్కై లైట్ పెట్టడం వల్ల చాలా మంచిది. దీనివల్ల మన ఎదుగుదలకు సహకరించే ఎన్నో అవకాశాలు మన తలుపు తడతాయి. అయితే పడక గదిలో స్కై లైట్ పెట్టరాదు. దీనివల్ల నెగెటివ్ ఫీలింగ్ కలుగుతుంది. ఇంటి పైకప్పుకు తెల్ల రంగు వేయడం శుభప్రదం. - హాల్ ఇంటీరియర్
మన ఇంటిలోని ద్వారాలు అన్నీ కచ్చితంగా దీర్ఘచతురస్రాకారంలో లేదా చతురస్రాకారంలో ఉండేట్లుగా చేసుకోవాలి. మరో ఇతర ఆకారాల్లో ద్వారాలు ఉండకూడదు. ముఖ్యంగా అర్థవృత్తాకారంలో, వంపులతో, ఇతర గుర్తుల రూపంలో ద్వారాలు ఏర్పాటు చేయకూడదు. ఒకవేళ ఇలాంటి ఆకారాలతో ద్వారాలు ఏర్పాటు చేస్తే, ఆ ఇంట్లో సరిగ్గా నిద్ర పట్టదు. అశుభం కూడా. - వంటగది వాస్తు
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో కచ్చితంగా వంట గది ఉండాలి. లేకుంటే చాలా సమస్యలు వస్తాయి. వంట గది దక్షిణ, తూర్పు మూలల్లో లేదా ఆగ్నేయ దిక్కున ఉండటం మంచిది. ఒకవేళ అలా కుదరని పక్షంలో ఉత్తర దిక్కున గానీ, పశ్చిమాన లేదా వాయువ్య కోణంలో ఏర్పాటు చేసుకోవచ్చు. వంటగది ప్లాట్ఫారం తప్పనిసరిగా తూర్పునే ఉండాలి. అదే విధంగా ఈశాన్యంలో నీటి సింక్, ఆగ్నేయ దిశలో వంట గ్యాస్ ఉండటం మంచిది. వంటింటి నేలపై గ్రానేట్ పరవటం లేదా గదిలో అద్దాలు ఉంచటం ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు. వీటి వల్ల తగాదాలు వచ్చే అవకాశం ఉంది. గోడ ఎత్తు కనీసం 4-5 అడుగులు ఉండాలి. లేకపోతే మహిళల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. వంటింటిని ఆనుకొని బోర్వెల్, టాయ్‌లెట్ ఉండకూడదు. ఈ విధంగా మీ ఇంటీరియర్ డిజైనింగ్ చేసేటప్పుడు ఈ జ్యోతిష్య శాస్త్ర నియామాలు పాటించి సుఖవంతమైన జీవితం గడపండి.
- మాచిరాజు వేణుగోపాల్, వాస్తుశాస్త్ర పండితులు
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పెళ్లైన స్త్రీలు పాపిట్లో సింధూరం ఎందుకు పెట్టుకుంటారు? - శాస్త్రం ఏం చెబుతుంది!