Tirumala Srivari Arjitha Seva Tickets for December 2024: తిరుమలలో కొలువైన కలియుుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం భారీగా భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి దర్శన భాగ్యం మాత్రమే కాకుండా.. ఆ వెంకన్నకు సేవ చేసుకునే భాగ్యాన్ని కూడా కల్పిస్తోంది టీటీడీ. ఇందులో భాగంగా 3 నెలల ముందుగానే ఆన్లైన్ ద్వారా.. ఆర్జిత సేవల టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా డిసెంబర్ నెలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసింది. మరి.. ఏయే తేదీల్లో ఏయే టికెట్లు విడుదల చేస్తోందనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు : డిసెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను సెప్టెంబర్ 18న మార్నింగ్ 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది టీటీడీ. అలాగే.. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 10 నుంచి 20వ తేదీ మార్నింగ్ 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంది. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులకు నగదు చెల్లించిన తర్వాత ఆర్జిత సేవల టికెట్లు ఖరారు అవుతాయని తెలిపింది.
21న కల్యాణోత్సవం టికెట్లు : ఈనెల 21న ఉదయం 10 గంటలకు ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు టీటీడీ అధికారులు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన టికెట్లను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.
23న అంగప్రదక్షిణ టోకెన్లు : డిసెంబర్ కోటా అంగప్రదక్షిణ టోకెన్లను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవాణి ట్రస్టు టికెట్లను అదే రోజు ఉదయం 11 గంటలకు, వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నారు.
స్పెషల్ దర్శనం టికెట్లు : అదే విధంగా.. సెప్టెంబర్ 24న ఉదయం 11 గంటలకు శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు(రూ.300 దర్శన టికెట్లు) విడుదల చేయనున్నారు. అదే విధంగా.. తిరుపతి, తిరుమలలో గదుల కోటాను ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు టీటీడీ అధికారులు.
27న శ్రీవారి సేవ కోటా.. : శ్రీవారి సేవ కోటా టికెట్లను ఈనెల 27వ తేదీన మార్నింగ్ 11 గంటలకు విడుదల చేయనున్నారు. అదేవిధంగా.. నవనీత సేవ టికెట్లు మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ టోకెన్లు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు టీటీడీ అధికారులు. కాబట్టి.. డిసెంబర్ నెలలో తిరుమల వెళ్లాలనుకుంటున్న భక్తులు ఈ విషయాన్ని గమనించి.. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ను సందర్శించి శ్రీవారి ఆర్జితసేవలు, స్పెషల్ దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి :
హైదరాబాద్ To తిరుపతి టూర్ అతి తక్కువ ధరలోనే! - శ్రీవారి శీఘ్రదర్శనంతోపాటు ఈ ఆలయాల సందర్శన!
శ్రీవారి భక్తులకు అద్భుతమైన శుభవార్త - తిరుపతి లడ్డూ మీ ఊళ్లోనే లభిస్తుంది!