TTD Cancelled VIP Break Darshan on Weekends: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. దేశం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులు చివరి దశకు చేరుకుంటుండడంతో.. భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా స్వామి దర్శనం కోసం కొండపై భక్తులు బారులు తీరుతున్నారు. దర్శనానికి సుమారు 30-40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా.. జూన్ 30వ తేదీ వరకు శుక్రవారం, శనివారం, ఆదివారాలలో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని.. భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని ఆలయ అధికారులు కోరారు. అంటే జూన్ 30వ తేదీ వరకు ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండబోవు. మిగిలిన రోజుల్లో అంటే సోమ, మంగళ, బుధ, గురువారాల్లో మాత్రమే బ్రేక్ దర్శనం అందుబాటులో ఉంటుంది.
తిరుమల వెళ్తున్నారా? - ఈ విషయం తెలుసుకోకపోతే చిక్కులు తప్పవు! - TTD Latest Updates on Devotees Rush
24 గంటలకు పైనే సమయం: టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్లు లేకుండా.. శుక్రవారం సాయంత్రానికి క్యూలైన్లలో ఉన్న భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు మొత్తం నిండిపోయయాయి. ఏకంగా రింగ్‌రోడ్డులోని ఆక్టోపస్ భవనం కూడలి వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఈ భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 24 గంటలకుపైగా సమయం పడుతోందని టీటీడీ చెబుతోంది.
భక్తుల కోసం ఏర్పాట్లు: ఈ క్రమంలోనే టీటీడీ భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్‌లలో ఉన్న భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, పాలు అందిస్తున్నారు.. అలాగే కొండపై అవసరమైన చోట కూడా ఈ సేవలు అందుబాటులోకి తెచ్చారు. మరో రెండు, మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. కాబట్టి.. భక్తులు కూడా ఈ రద్దీని గమనించి తిరుమల ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
ముగిసిన పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు: మరోవైపు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరిరోజైన శుక్రవారం ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపారు. అనంతరం సహస్రనామార్చన, ఉత్సవర్ల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహించారు. రాత్రి ఏడున్నర నుంచి గంటపాటు అమ్మవారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. మహాపూర్ణాహుతితో అమ్మవారి వసంతోత్సవాలు ఘనంగా ముగిశాయి.