Tirumala Sri Venkateswara Swamy Brahmotsavam : ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన, మహిమాన్వితమైన ఆలయంగా పేరొందిన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆ దేవదేవుడు స్వయంభువుగా వెలిశాడు. రోజూ కొన్ని లక్షల మంది దర్శించుకునే ఆలయం ఒక్క తిరుమల వెంకన్న స్వామిదే అంటే అది అతిశయోక్తి కాదు. క్షణ కాలమైన స్వామిని చూడగలిగితే చాలంటూ భక్తులు ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి స్వామి దర్శనానికి వస్తుంటారు. అయితే బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రం ఈ సంఖ్య రెట్టింపవుతుంది.
బ్రహ్మోత్సవాలు ఏప్పటి నుంచి ప్రారంభమవుతాయంటే?
2024 ఏడాదికి గానూ బ్రహ్మోత్సవాల షెడ్యూల్ను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తాజాగా విడుదల చేశారు. అక్టోబర్ 3వ తేదీ (గురువారం) నుంచి ఈ బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. ఆ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.
- అక్టోబర్ 3వ తేదీ గురువారం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు.
- అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం బ్రహ్మోత్సవాలలో మొదటి రోజున మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ధ్వజారోహణం కార్యక్రమంతో శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికే కార్యక్రమం జరుగుతుంది. అనంతరం రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహనంలో స్వామి వారు ఉరేగుతారు.
- అక్టోబర్ 5వ తేదీ శనివారం బ్రహ్మోత్సవాలలో రెండో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు చిన శేష వాహనంలో స్వామి వారు ఊరేగుతారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం పేరిట ఉత్సవర్లకు అభిషేకం జరుగుతుంది. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై శ్రీవారు విహరిస్తారు.
- అక్టోబర్ 6వ తేదీ ఆదివారం బ్రహ్మోత్సవాలలో మూడో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సింహ వాహనంపై శ్రీనివాసుడు ఊరేగుతాడు. అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై కలియుగ నాధుడు విహరిస్తాడు.
- అక్టోబర్ 7వ తేదీ సోమవారం బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై బ్రహ్మాండ నాయకుడు విహరిస్తాడు.
- అక్టోబర్ 8వ తేదీ మంగళవారం బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మోహినీ అవతారంలో స్వామి భక్తులను అలరిస్తాడు. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు గరుడ వాహన సేవ జరుగుతుంది. ఈ సేవను చూడడానికి ముక్కోటి దేవతలు భూమిపైకి వస్తారని బ్రహ్మాండ పురాణంలో వివరించారు.
- అక్టోబర్ 9వ తేదీ బుధవారం బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు హనుమంత వాహన సేవ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వర్ణ రథోత్సవం జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు గజవాహనంపై వేంకటేశ్వరస్వామి ఊరేగుతాడు.
- అక్టోబర్ 10వ తేదీ గురువారం బ్రహ్మోత్సవాలలో ఏడో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సూర్యప్రభ వాహన సేవ జరుగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం జరుగుతుంది. అనంతరం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై శ్రీవారు భక్తులను అలరిస్తారు.
- అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజు ఉదయం 6 గంటలకు రథోత్సవం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు అశ్వవాహనంపై కల్కి అవతారంలో శ్రీనివాసుడు ఊరేగుతాడు.
- అక్టోబర్ 12వ తేదీ శనివారం బ్రహ్మోత్సవాలలో తొమ్మిదో రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు పల్లకీ ఉత్సవం & తిరుచ్చి ఉత్సవం జరుగుతుంది. అనంతరం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు స్నపన తిరుమంజనం, చక్రస్నానంతో బ్రహ్మోత్సవ వేడుకలు ముగియనున్నాయి.
- బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు జరుగవు. స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతారు. ముందుగా బుక్ చేసుకున్న వారికి ఇబ్బంది ఉండదు. ఉచిత దర్శనానికి వెళ్లే భక్తులకు కూడా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి బ్రహ్మోత్సవాలలో స్వామివారి దర్శనానికి వెళ్లాలనుకునేవారు తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
ఓం నమో వేంకటేశాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.