Tholi Ekadashi 2024 Date and Significance: పంచమి, సప్తమి, దశమి తిథుల్లానే ఏకాదశి చాలా పవిత్రమైంది. శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి అంటూ నెలకు రెండుసార్లు చొప్పున సంవత్సర కాలంలో ఏకాదశి తిథి 24సార్లు వస్తుంది. అధికమాసం వస్తే మరో రెండుసార్లు కలిపి 26సార్లు వస్తుంది. వీటిలో తొలి ఏకాదశి మహా విశిష్టమైంది. మరి ఇంతటి విశిష్టమైన తొలి ఏకాదశి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది? ఆ రోజున ఏం చేయాలి? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
తొలి ఏకాదశి ప్రాముఖ్యత : ఆషాఢ మాసంలో తొలి ఏకాదశినే.. దేవశయని ఏకాదశి, పద్మనాభ ఏకాదశి, హరిశయని ఏకాదశి అని కూడా అంటారు. క్షీరసాగరంలో శేషతల్పంపై శ్రీహరి ఆషాఢమాసంలోని తొలి ఏకాదశినాడు యోగనిద్రకు సమాయత్తమవుతాడని విష్ణుపురాణం పేర్కొంది. ఏకాదశి రోజున శ్రీహరి యోగనిద్రకు వెళ్లి.. కార్తికమాసంలో దేవుత్తని ఏకాదశి రోజున మేల్కొంటాడని నమ్మకం. అంతేకాదు తొలి ఏకాదశి నుంచే హిందువుల పండగలు ప్రారంభం అవుతాయని విశ్వసిస్తుంటారు. తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలలపాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని.. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ 4 నెలల్లో ఎక్కువ సమయం భగవంతుని పూజిస్తారు. జైన మతంలో కూడా ఈ రోజుకు ప్రాముఖ్యత ఉంది. జైనులకూ చాతుర్మాసం ప్రారంభమవుతుంది. అంటే ఈ రోజు నుంచి జైన సాధువులు కూడా నాలుగు నెలలపాటు ప్రయాణం చేయకుండా.. ఒకే చోట ఉండి శ్రీ మహా విష్ణువును పూజిస్తారు.
ఈ తీర్థంలో నీరు తాగితే సర్వరోగాలు నయం! ఈ దక్షిణ తిరుపతి ఎక్కడ ఉందో తెలుసా!
తొలి ఏకాదశి 2024 ఎప్పుడంటే: హిందూ పంచాంగం ప్రకారం.. ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి తిథి జులై 16వ తేదీ మంగళవారం రాత్రి 8:33 గంటలకు ప్రారంభమై.. జులై 17వ తేదీ బుధవారం రాత్రి 09:02 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం.. ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జులై 17న జరుపుకుంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, నియమ నిష్ఠలతో విష్ణువుతోపాటు లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల శ్రీ హరి అనుగ్రహంతో జీవితంలో సుఖసంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం.
తొలి ఏకాదశి రోజు చేయాల్సిన పనులు:
- తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి.
- పూజా మందిరాన్ని అలంకరించి శ్రీమహా విష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి.
- ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి.. మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. ఆ రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది.
- శ్రీ హరికి నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా చేర్చాలి.
- పేదలకు ధనం, ధాన్యాలు, వస్త్రాలు దానం చేయాలి. అలాగే ఈ రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
తొలి ఏకాదశి నాడు చేయకూడని పనులు:
- ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు. అంటే మద్య, మాంసాలకు దూరంగా ఉండాలి.
- ఆ రోజున అన్నం తినకూడదు.
- స్త్రీలను, పెద్దలను అవమానించకూడదు.
- బ్రహ్మచర్యం పాటించాలి.
- మొక్క నుంచి తులసి ఆకులను తెంపకూడదు.
- ఉపవాసం ఉన్న వ్యక్తి.. ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు.
- గోళ్లు, వెంట్రుకలు కత్తిరించకూడదు.
NOTE : పైన తెలిపిన వివరాలు ప్రముఖ ఆధ్యాత్మిక నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
మూడు సంఖ్యకు పరమశివుడికి క్లోజ్ రిలేషన్! అసలేమిటి రహస్యం?
ఆషాఢంలో విశిష్ట పండుగలు, నెలంతా విశేషాలే! సుబ్రమణ్యస్వామిని ఆరాధిస్తే పెళ్లికి లైన్ క్లీయర్!