Surya Tilakam to Ram Lalla in Ayodhya: శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో అద్భుతం చోటుచేసుకోనుంది. గర్భగుడిలో ఉన్న బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్య కిరాణాలు ప్రసరించనున్నాయి. ఇందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనిని "సూర్యతిలకం"గా అభివర్ణిస్తున్నారు. అయోధ్యలోని రామాలయంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి విగ్రహం నుదుటిపై ‘సూర్య తిలకం’ కనువిందు చేయనుంది.
సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై బొట్టులా 58 మిల్లీమీటర్ల పరిమాణంలో, ఐదు నిమిషాలపాటు ప్రసరించనున్నాయి. రామాలయ నిర్మాణ సమయంలో ట్రస్ట్ సభ్యుల కోరిక మేరకు కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ(సీబీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు సూర్యతిలకం ఏర్పడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారని.. సీబీఆర్‌ఐ ప్రతినిధి, హైదరాబాద్‌కు చెందిన డా.ప్రదీప్‌కుమార్ రామన్ చెర్ల తెలిపారు.
19 ఏళ్లపాటు నవమి రోజునే వచ్చేలా: సూర్యతిలకం 19 సంవత్సరాల పాటు శ్రీరామనవమి రోజు బాలరాముడి విగ్రహంపై ఏర్పడనుంది. ఇందుకోసం బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్(ఐఐఏ) శాస్త్రవేత్తలను, పరిశోధకులను సీబీఆర్‌ఐ సంప్రదించింది. వారు అధ్యయనం చేసి మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా.. పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. వీటిని బెంగళూరులోని ఆప్టికా సంస్థ సమకూర్చింది.
ఇలా సూర్య కిరణాలు ప్రసరిస్తాయి: ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపు లోపలికి కాంతి ప్రసరిస్తుంది. ఏటా సూర్యకిరణాలు అక్కడే ఎలా పడతాయి? వాతావరణంలో మార్పులు వస్తుంటాయి కదా? గ్రహాల పరిభ్రమణం, సమయం ఒకేలా ఉంటుందా? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఈ సమస్యను అధిగమించేందుకు గడియారంలో ముల్లులు తిరిగేందుకు ఉపయోగించే పరిజ్ఞానం తరహాలో "గేర్ టీత్ మెకానిజం" వినియోగించారు.
శ్రీరామనవమి రోజు ఈ పనులు అస్సలే చేయకండి - కష్టాలను కోరి తెచ్చుకున్నట్టే!
సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్దే మరో పరికరం ఉంచారు. ఇది కాంతిని గ్రహించే అద్దాన్ని 365 రోజులు స్వల్పంగా కదుపుతూ ఉంటుంది. మళ్లీ నవమి రోజు వారు అనుకున్న చోటుకు తీసుకొస్తుంది. అంతకుముందే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వచ్చే కాలాన్ని సెకన్లతో సహా లెక్కలు వేశారు. ఈ లెక్కల సాయంతో సూర్యకిరణాలు ప్రసరింపజేసే పరికరాలు, వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ 19 ఏళ్లు నిరాటంకంగా పనిచేస్తుంది. ఆ తర్వాత మరోసారి సమయాన్ని సరి చేయాలని అని పరిశోధకులు తెలిపారు. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు ఇప్పటికే లక్షలాది మంది భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్షప్రసారం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
దర్శన వేళల్లో స్వల్ప మార్పులు: శ్రీరామ నవమి రోజున రామ్‌లల్లా దర్శన సమయాలు మారుతాయని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారు జామున 3.30 గంటల నుంచి మంగళహారతి, అభిషేకం, అలంకరణ, దర్శనాలు ఉంటాయన్నారు. ఉదయం 5.00 గంటలకు శృంగార్ హారతి ఉంటుందని పేర్కొన్నారు. దర్శనాలు, పూజా కార్యక్రమాలు ఏకకాలంలో కొనసాగుతాయని.. నైవేద్యం సమర్పించే సమయంలో కొద్దిసేపు దర్శనాలను నిలిపివేయనున్నట్లు తెలిపారు. రాత్రి 11 గంటల వరకు దర్శనాలు ఉంటాయని.. పరిస్థితులకు అనుగుణంగా భోగ్, శయన హారతి ఉంటుందని చెప్పారు. అలాగే 19వ తేదీ వరకు వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
శ్రీరామనవమి రోజు ఈ పరిహారాలు చేస్తే - కష్టాలన్నీ తొలగి సంతోషాలు మీ వెంటే!
శ్రీరామనవమి స్పెషల్ - మీ ఆత్మీయులకు ఇలా విషెస్ చెప్పండి!
రేపే శ్రీరామనవమి - స్వామి ప్రసాదం పానకం, వడపప్పు ఇలా తయారు చేయండి